నవంబర్ 13... ఫ్రాన్స్ దేశానికి ఓ చీకటి దినం. దేశ రాజధాని పారిస్ పై ఉగ్రవాదులు దాడిలో 129 మంది అమాయకులు మరణించారు. ఆ దాడులకు కారణం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులని ప్రపంచమంతా తెలుసు. వారు కూడా ప్రకటించారు. ఆ దాడులతో పడగవిప్పిన త్రాచులా లేచింది ఫ్రాన్స్. ఆరోజు నుంచి ఉగ్రవాదుల కోసం వెతుకుతూనే ఉంది. ఐఎస్ స్థావరమైన సిరియాపై గగనతలం నుంచి తీవ్ర దాడులకు తెగబడింది. ఇదే ఊపు ఇప్పుడు బెల్జియానికి వచ్చింది. ఫ్రాన్స్ పక్కనే బెల్జియం దేశం ఉంది. ఉగ్రవాదులు దాడి అనంతరం బెల్జియంలోకి ప్రవేశించారని ఇంటెలిజెన్స్ తెలిపింది. ఇప్పటికీ స్లీపర్ సెల్స్ బెల్జియం, ఫ్రాన్స్ లలో ఉన్నారని చెప్పింది. దీంతో ఉగ్రవాదులను, వారి అనుయాయులను పట్టుకోవడానికి ఫ్రాన్స్, బెల్జియం దేశాలు వందల కొద్దీ సైన్యాన్ని రంగంలోకి దింపి జల్లెడ పడుతున్నాయి. ముఖ్యంగా పారిస్ నగరంపై దాడుల సూత్రధారి సలా అబ్దెస్లాం ఇప్పటికీ దొరకలేదు. అతను దాడి చేశాక బెల్జియానికి పారిపోయాడని చాలా గట్టి ఆధారాలు పోలీసుల వద్ద ఉన్నాయి. దీంతో బెల్జియం లో వేట చాలా తీవ్రతరమైంది. ఆదివారం దాదాపు 22 చోట్ల దాడులు చేశారు పోలీసులు. 16 మంది అనుమానితులను అరెస్టు చేశారు. కానీ సలా ఆచూకీ దొరకలేదు. పట్టుబడిన వారిదగ్గర ఎలాంటి ఆయుధాలు కానీ, పేలుడు పదార్థాలు కానీ లభించలేదని బెల్జియం అధికారులు చెబుతున్నారు. బెల్జియం లో హై అలర్ ప్రకటించారు. బెల్జియం ప్రధానమంత్రి చార్లెస్ మైకెల్ సోమవారం స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలకు సెలవు ప్రకటించారు. నగరాలలో ఉన్ సబ్ వేలను మూసివేయమని ఆదేశించారు.
Mobile AppDownload and get updated news