Mobile AppDownload and get updated news
మూడు రోజుల ఆగ్నేయాసియా దేశాల పర్యటనలో భాగంగా సోమవారం మోడీ మలేషియాలో అడుగుపెట్టారు. ఆయనకు మలేషియా ప్రధాని నజీబ్ రజాక్ సాదర స్వాగతం పలికారు. ఆ దేశ సైనికులు గౌరవ వందన సమర్పించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మలేషియా ప్రధానితో చర్చించారు. రక్షణ, సైబర్ నేరాలను అరికట్టడం వంటి అంశాలు చర్చకు వచ్చాయి. 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమానికి మలేషియా సహకారాన్ని మోడీ కోరారు. అలాగే భారత్ లో వంద స్మార్ట్ సిటీల నిర్మాణానికి సహకరించాల్సిందిగా మలేషియాను కోరారు. చర్చల అనంతరం మోడీ మాట్లాడుతూ భారత్ - మలేషయాలు రెండూ... ప్రజాస్వామ్యం, వైవిధ్యతతో నిర్మితమయ్యాయని అన్నారు. ఇరు దేశాల మధ్య రక్షణ పరమైన సహకారం బలంగా ఉంటుందని అన్నారు. అంతేకాదు తీవ్రవాదాన్ని రూపు మాపడంలో మలేషియా విజయం సాధించిందని మెచ్చుకున్నారు. మలేషియా విద్యార్థులను ఉన్నత చదువుల కోసం భారత్ రావాల్సిందిగా ఆహ్వానించారు. మలేషియా రాజధాని కౌలాలంపూర్లో నిర్మించిన 'తోరణ గేట్' ను మోడీ ప్రారంభించారు. దీనిని పూర్తిగా భారత్ నిధులతో నిర్మించారు. మోడీ వచ్చిన సందర్భంగా అక్కడ ఉన్న ప్రవాస భారతీయులు, మలేషియా పౌరులు భారీ సంఖ్యలో తోరన్ గేట్ కు చేరుకున్నారు. ప్రారంభం అనంతరం మోడీ మాట్లాడుతూ ఇది కేవలం రాతి కట్టడం కాదని, ఇరు దేశాలకు సంస్కృతికి ప్రతిబింబం అన్నారు.