పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై తీవ్రవాదుల దాడికి సంబంధించి భారత్ చేస్తున్న విచారణలో పాలుపంచుకునేందుకు మనదేశానికి వచ్చిన పాక్ సంయుక్త విచారణ బృందంలో ఆ దేశ గూడచార సంస్థ (ఐఎస్ఐ) అధికారి ఒకరు సభ్యుడుగా ఉండటాన్ని కాంగ్రెస్ తీవ్రంగా తప్పుపట్టింది. పరాయిదేశానికి చెందిన గూఢచార సంస్థ ఉద్యోగిని కీలకమైన భద్రతాస్థావరంలోకి ప్రభుత్వం ఎలా అనుమతిస్తుందంటూ ఆ పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రెండు రోజుల క్రితమే పాక్ విచారణ బృందం భారత్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆ బృందం మంగళవారం ఉదయం అమృత్‌సర్ నగరం నుండి బుల్లెట్‌ప్రూఫ్ వాహనంలో పఠాన్‌కోట్ చేరింది. ఈ సందర్భంగా ఆ బృందానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పఠాన్‌కోట్ వైమానిక స్థావరం ఎదుట కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరి పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాక్ బృందంలో భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసే ఆ దేశ గూడచార సంస్థ అధికారిని సభ్యుడిగా నియమించడాన్ని ఆ పార్టీ నేతలు తప్పుపట్టారు. పాక్ ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్రం ప్రశ్నించనందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరాయి దేశ బృందాన్ని భద్రతాపరంగా కీలకమైన స్థావరాల్లోకి అనుమతించడమే తీవ్ర నిర్ణయం కాగా, ఒక గూడఛారిని కూడా మన స్థావరంలోకి అనుమతించడమంటే అది ఇంకెంత పెద్ద తప్పవుతుందో ప్రభుత్వానికి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, పాక్ బృంద పర్యటన కారణంగా పఠాన్‌కోట్ పరిసరాలన్నీ అత్యంత కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాట్లతో నిండిపోయాయి. ఎక్కడ చూసినా భద్రతా సిబ్బంది, పోలీసు బలగాలు కనిపించాయి.
![]()
(పఠాన్ కోట్ స్థావరంలో పర్యటిస్తున్న పాక్ బృందం)
![]()
(పాక్ బృందం పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల దృశ్యం)
Mobile AppDownload and get updated news