దేశంలో ఇక రానున్న రోజుల్లో హరిత ఓడరేవులు దర్శనమివ్వనున్నాయి. కాలుష్యానికి దూరంగా ఆహ్లాదకరంగా ఓడరేవులను తీర్చిదిద్ది అంతర్జాతీయ ప్రమాణాల మేరకు వాటిని అభివృద్ధి చేసే దిశలో భాగంగా ఇటీవల చెప్పుకోదగిన ముందడుగు పడింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలో దేశంలోని పెద్ద ఓడరేవులను హరితమయంగా మార్చే ప్రాజెక్టుకు సంబంధించిన ఒప్పందాలపై కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు ఆయా అభివృద్ధి సంస్థల అధికారులు సంతకాలు చేసారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఓడరేవులు అత్యంత కీలకమని ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ చెప్పారు. వివిధ ప్రాంతాల్లోని పెద్ద ఓడరేవులన్నింటినీ రానున్న రోజుల్లో హరిత ఓడరేవులుగా మార్పుచేసేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు. అందులో భాగంగా తొలుత కాండ్లా పోర్ట్ ట్రస్టును హరిత ఓడరేవుగా మార్చనున్నట్లు తెలిపారు. దాంతోపాటు అన్ని ఓడరేవుల్లోను పవన విద్యుత్చక్తి కోసం కేంద్రం ప్రణాళిక రూపొందించిందన్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే కార్యాచరణ మొదలవుతుందని తెలిపారు.
Mobile AppDownload and get updated news