దేశరాజధాని ఢిల్లీలో తొలిసారిగా శునకరాజాలు, రాణుల కోసం ప్రత్యేకంగా ఒక కెఫే ప్రారంభమైంది. దానిపేరు పప్పీచినో. దేశంలో రోజురోజుకు మూగజీవాల పట్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. వాటిల్లో అత్యధికంగా కుక్కలే ప్రజల ఆదరాభిమానాలను పొందుతున్నాయి. మనమంటే మనకిష్టమైన సమయంలో ఇష్టంవచ్చిన కెఫేటేరియాకో, రెస్టారెంటుకో వెళ్లి ఇష్టం వచ్చిన దాన్ని లాగించి రాగలం. కానీ, ఆ సౌలభ్యం కుక్కలకు మాత్రం లేదు. ఈ నేపథ్యంలో విదేశాల్లో ఎప్పుడో ఈ తరహా డాగ్ కేఫ్ లు, రెస్టారెంటులు ప్రారంభమయ్యాయి. కాస్త ఆలస్యంగా అయినా ఈ సంస్కృతి మన దేశంలో ఇటీవలే మొదలవుతోందనడానికి ఈ పప్పీచినోనే ఉదాహరణ అంటున్నారు. ఢిల్లీలోని ట్రెండీ, పోష్ లొకాలిటీగా పేరొందిన ప్రాంతాల్లో ఒకటయిన హాజ్ ఖాస్ గ్రామంలో దీన్ని ఇటీవలే ప్రారంభించారు.
తమ పప్పీచినోకు ఢిల్లీ వాసుల నుండి అనూహ్యరీతిలో స్పందన లభించడం చూసి దాని యజమాని ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు. ఈ కుక్కల రెస్టారెండులో శునకాలకు ఎంతగానో ఇష్టమైన వంటకాలు వండివారుస్తారు. తమ శునకాలతో వచ్చే యజమానులు అక్కడి మెన్యూల్లో తమ వాటికి అవసరమైన వాటిని ఆర్డరివ్వవచ్చు. అంతేకాదు, ఇక్కడ కుక్కలకు ఒక విధంగా మంచి భోగమే లభిస్తుంది. ఆడుకునేందుకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటుచేసారు.
Mobile AppDownload and get updated news