Mobile AppDownload and get updated news
షీనా బోరా... కన్నతల్లి చేతిలో హత్యకు గురైన ఓ కూతురు. తన చేతులతో తానే చంపేసి బతికే ఉన్నట్టు మూడేళ్లు లోకాన్ని నమ్మించింది ఆమె తల్లి ఇంద్రాణి. సూపర్ హిట్ సినిమాల స్క్రీన్ ప్లేను కూడా తలదన్నేలా హత్యా కథనాన్ని నడిపించింది. అందులో ఆమెకు మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ ప్రత్యక్షంగా సహకరించగా, ప్రస్తుత భర్త పీటర్ పరోక్షంగా సహకరించినట్టు సీబీఐ తేల్చింది. అయితే ఒకప్పటి స్టార్ టీవీ సీఈవో అయిన పీటర్ బెయిలు కోసం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పటికే రెండు సార్లు ఆయన బెయిలు పిటిషన్ ను కోర్టు కొట్టి వేసింది. ఇప్పుడు తాజాగా మళ్లీ ఆయన పెట్టుకున్న బెయిలు దరఖాస్తును తోసిపుచ్చింది కోర్టు. ఈ సందర్భంగా సీబీఐ తరపు లాయర్ కోర్టుకు కొన్ని విషయాలను తెలిపారు. షీనా బోరా హత్యకు సంబంధించి అన్ని విషయాలు పీటర్ కు ముందే తెలుసని, అతను కూడా నేరంలో భాగస్వామేనని తెలిపారు. హత్యకు ముందు రోజు ఇంద్రాణి పీటర్ తో 11 నిమిషాల పాటూ ఫోన్ లో మాట్లాడిందని, ప్రణాళిక ప్రకారం హత్య ఎలా చేయాలన్న దానిపై చర్చించారని లాయర్ కోర్టుకు తెలిపారు. ఇంద్రాణికి పీటర్ తరుపు నుంచి పూర్తి సహకారం అందిందని కోర్టుకు విన్నవించారు.