Mobile AppDownload and get updated news
రాజేంద్ర సిసోడియా... మధ్యప్రదేశ్‌లోని ఖర్గోనే జిల్లాలోని బడి అనే గ్రామ సర్పంచ్. కొన్ని రోజుల క్రితమే కొత్తగా ఎన్నికయ్యాడు. తన ఇంటి ముందు కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. గ్రామంలోని కష్టాలను ఎలా గట్టెక్కించాలి... పరిస్థితులు ఎలా చక్కదిద్దాలన్నదే ఆయన ఆలోచనల సారాంశం. ఇంతకీ ఆ గ్రామానికొచ్చిన కష్టమేంటో తెలుసా? ఆత్మహత్యలు. అవును ఈ ఏడాది మొదలైన తరువాత మూడు నెలల్లో 80 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. అందరూ పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకుంటున్నారు. ఆ గ్రామంలో 320 కుటుంబాలు ఉంటే... ప్రతి కుటుంబంలోనూ ఎవరో కనీసం ఒక్కరైనా ఆత్మహత్య చేసుకున్న చరిత్ర ఉంటుంది. ఇప్పుడదే ఆ ఊరి సమస్య. అంతెందుకు కొత్త సర్పంచ్ రాజేంద్ర సిసోడియా సర్పంచి అయిన తన అన్న ఆత్మహత్య చేసుకున్నాక ఆ పదవిలోకి వచ్చాడు. ఆమె తల్లి కూడా ప్రాణాలు తీసుకుంది. గ్రామంలో ఇలాంటి పరిస్థితి కారణాలుగా కరవు, మానసిక అస్థిరత్వం, వ్యాకులత, డిప్రెషన్, మూఢనమ్మకాలను చెప్పుకోవచ్చు. గ్రామస్థులు తమ గ్రామంలో ఇలా ఎక్కువమంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం దయ్యాలని భావిస్తుంటే... సైక్రియాటిస్టులు మాత్రం అదంతా డిప్రెషన్, మానసిక వ్యాధుల వల్లేనని తెలిపారు. ముఖ్యంగా ఆ గ్రామంలో రైతులు పత్తి పంటను వేస్తుంటారు. వారు వాడే పురుగులమందులు కూడా చాలా ప్రమాదకరమైనవి. నిత్యం వాటి వాడకం, వాసన పీల్చడంవల్ల అందులో ఉండే ఆర్గానోఫాస్పేట్ అనే రసాయనం మెదడుపై ప్రభావం చూపిస్తుందని, మానసిక వ్యాకులతను కలుగజేస్తుందని మానసిక వైద్యులు చెబుతున్నారు. బడి గ్రామం గురించి తెలుసుకున్న ఖర్గోనే కలెక్టర్ ఓ కమిటీని వేసి... ఆత్మహత్యలు ఆపేందుకు, గ్రామస్థుల్లో స్థైర్యాన్ని నింపేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.