1.నోబెల్ బహుమతిని సాహిత్య రంగంలో అందుకున్న మొదటి నాన్ యూరోపియన్ ఠాగూరే. 157 గీతాలతో కూడిన ఆయన కావ్యం ''గీతాంజలి''. రవీంద్రుని రచనలలో గీతాంజలి చాలా గొప్పది. రవీంద్రుడు తాను బెంగాలీ భాషలో రచించిన భక్తిగీతాలను కొన్నింటిని ఆంగ్లంలోకి అనువదించి గీతాంజలి అని పేరు పెట్టాడు. అది అనేక ప్రపంచ భాషల్లోకి అనువాదం అయింది. ప్రపంచ సాహిత్యంలో ఇది గొప్ప రచన. మానవుని కృంగదీసే నిరాశా నిస్పృహలను, సకల సృష్టిని ప్రేమభావంతో చూచి శ్రమ గొప్పతనాన్ని సూచించే మహత్తర సందేశం గీతాంజలిలోని ముఖ్యాంశం. 1913వ సంవత్సరంలో సాహిత్యానికి సంబంధించి రవీంద్రుని గీతాంజలికే నోబెల్ బహుమతి లభించింది. విశ్వకవి అనే బిరుదును సాధించి పెట్టింది.
2. 8 ఏళ్ల వయసులోనే రవీంద్రుడు కవిత్వం రాయటం ప్రారంభించారు. 16 ఏళ్లకు తన మొదటి పుస్తకం భానుసింహ ను అచ్చు వేశారు. ఆయన గొప్ప సంగీతకారుడు, చిత్రకారుడు, నాటకకారుడు కూడా. 2000కు పైగా పెయింటింగ్స్ వేశారు. ఆయన నాటకాలు సినిమాలుగా కూడా వచ్చాయి.
3.భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి రవీంద్రనాథ్ ఠాగూర్.బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని రాసింది కూడా ఠాగూరే కావడం గమనార్హం. ప్రపంచంలో రెండు దేశాలకు జాతీయ గీతం రాసిన ఏకైక వ్యక్తి. ఠాగూర్ సంపాదకత్వంలో వెలువడే తత్త్వబోధిని అనే పత్రికలో భారతవిధాతా అనే శీర్షికతో తొలుత రచించారు. ఈ గీతం బెంగాలీ భాషలో మొత్తం 31 చరణాలుండేది. కానీ అందులో మనం ఏడు చరణాలు మాత్రమే జాతీయగీతంగా ఆలపిస్తున్నాం.
4. జనగణ మనను ఆయన చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో ఉన్నప్పుడు ఇంగ్లీష్ లోకి అనువాదం చేశారు. 1919లో మదనపల్లె వచ్చిన ఠాగోర్ జనగణమనను ఆంగ్లంలోకి తర్జుమా చేసి బహిరంగంగా ఆలపింపజేశారు.
5. 2200 పాటలకు ఆయనే స్వయంగా సంగీతం సమకూర్చారు. టుమ్రి స్టయిల్లో ఆయన స్వరపరిచిన గీతాలు రవీంద్ర సంగీత్ పేరుతో ప్రసిద్ధం అయ్యాయి. 6. 1915 లో ఆయనను బ్రిటిష్ ప్రభుత్వం నైట్ హుడ్ తో గౌరవించింది.
7. గాంధీని మొట్టమొదటగా మహాత్మా అని సంభోదించిన వ్యక్తి ఠాగూర్. వీరు ఇద్దరు మొట్టమొదటి సారిగా 1914లో కలుసుకున్నారు.
8. రవీంద్రుడు కేవలం రచయితగానే ఉండిపోక, బాలల హృదయాలను వికసింపచేయటానికి ప్రాచీన మునుల గురుకులాల తరహాలోనే శాంతినికేతన్‌గా ప్రసిద్ధి గాంచిన విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. అది అయిదుగురు విద్యార్థులతో మొదలై, క్రమంగా విస్తరించింది.
Mobile AppDownload and get updated news