ఒకే పార్టీలోని రెండు ప్రత్యర్ధి గ్రూపుల మధ్య నెలకొన్న రాజకీయ శత్రుత్వమే వారు తమ పరీక్షల్లో కృతార్థులు కాకుండా చేసింది. అదే.. పాపం అభం శుభం ఎరుగని విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఒకప్పుడు శాంతి భద్రతలకు మారుపేరుగా నిలిచిన గ్రామంలో ఇప్పుడు ముఠాకక్షలు పురివిప్పి నాట్యమాడుతున్నాయి. ప్రతీ చిన్న విషయానికి కూడా వివాదం చిలికి చిలికి గాలివానగా మారడం.. రెండు గ్రూపులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం సర్వసాధారణంగా మారింది. కొద్ది కాలంగా నానూర్ ప్రాంతం అనగానే యావత్ పశ్చిమబెంగాల్ వాసులకు ముఠాకక్షలకు మారుపేరుగా మారిపోయింది. అక్కడి వర్గాలు ఒకరిపై ఒకరు బాంబులు విసురుకోవడంలో చేయితిరిగిన నేర్పరులు. వీరి ఘర్షణలో సామాన్యులు సమిధలు. ఆ పాఠశాలలో మాధ్యమిక పరీక్షలు జరిగేందుకు రెండు నెలలు గడువుందనగా ఘర్షణలు చెలరేగాయి. ఒకరిపై ఒకరు బాంబులు విసురుకుంటూ, కనిపించిన వారిని కనిపించినట్లు కత్తులూ కటార్లతో నరుకుతూ రక్తాన్ని ఏరుల్లా పారింపచేసారు.
ఈ దశలో యావత్ గ్రామం కట్టుబట్టలతో ప్రాణాలను కాపాడుకోవడానికి వేరే ప్రాంతాలకు పారిపోవాల్సి వచ్చింది. ప్రాణాలుగ్గబట్టుకుని బతకాల్సిన తరుణంలో చదువులెలా కొనసాగుతాయి. చివరకు ఆ విద్యార్థులు ఏదో తమకు తోచిన రీతిలో ఇంటి దగ్గరే ఉండి పరీక్షలకు సిద్దమయ్యారు. పరీక్షలు జరిగే రోజుల్లో కూడా ఆ గ్రామంలో ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ఆందోళనకారుల కంటిలో పడకుండా వేరే వేరే మార్గాల ద్వారా పాఠశాలకు చేరుకున్న విద్యార్థులు తమ పరీక్షలు రాసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. బయటి ఉద్రిక్త వాతావరణం కారణంగా పరీక్షలు రాయడంపై దృష్టి నిలుపలేకపోయారు. దాంతో విద్యార్థులంతా ఫెయిలయ్యారు. పరీక్ష ఫలితాలు చూసి టీచర్లు తలలు పట్టుకోగా, తల్లితండ్రులు షాకుకు గురయ్యారు. విద్యార్థులంతా నిరుపేద కుటుంబాలకు చెందిన వారు. ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకోలేక తమ బిడ్డలను ఆ ప్రభుత్వ పాఠశాలలో చదివించుకుందామనుకున్నారు. ఇప్పుడీ రాజకీయ ప్రత్యర్థిత్వం విద్యార్థుల చదువులకు శాపంగా మారడం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
You can also read this story in Benagali: http://eisamay.indiatimes.com/state/Nanoors-most-of-the-students-failed-due-to-political-clash/articleshow/52232240.cms
Mobile AppDownload and get updated news