Mobile AppDownload and get updated news
దేశంలో ఎన్నికలు జరిగే ప్రతీసారి.. అవి చిన్నవైనా పెద్దవైనా డబ్బు మాత్రం చేతులు మారి తీరాల్సిందే. డబ్బుతో ఓటర్లను ప్రలోభపెట్టి ఓట్లను కొనుగోలు చేయాల్సిందే అనే రీతిలో పరిస్థితి తయారైంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరిగిన ప్రతీసారి ఎన్నికల సంఘం అధికారులు, పోలీసులకు పెద్ద పనే పడుతుంటుంది. డబ్బుతో ఓటర్లను ప్రలోభపెట్టకుండా చూసేందుకు వారు డేగకళ్లతో అనుక్షణం అప్రమత్తంగా ఉంటారు. అక్రమంగా తరలిస్తుండే కోట్ల కొద్ది డబ్బును ఎన్నికల రోజు వరకు స్వాధీనం చేసుకుంటూనే ఉంటారు. తాజాగా శుక్రవారం నాడు తమిళనాడులో తిరుప్పూర్ వద్ద అధికారులకు కోట్ల కొద్ది డబ్బు పట్టుపడింది. మూడు కంటెయినర్లలో తరలిస్తున్న దానిని లెక్కిస్తే అది రూ.570 కోట్లుగా లెక్కతేలింది. దానికి సంబంధించిన పత్రాలు సరిగా లేకపోవడంతో దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఆ డబ్బు తనదని భారతీయ స్టేట్ బ్యాంక్ ఎన్నికల సంఘానికి తెలిపింది. అధికారులు జరిపిన విచారణలో అది ఆ బ్యాంకుదేనని తేలింది. ఈ విషయాన్ని తమిళనాడు ఎన్నికల అధికారి ఒకరు చెప్పారు.