ప్రిన్స్ మహేశ్ బాబు తన బ్రహ్మోత్సవం చిత్ర విశేషాలను ఫ్రీడోకాస్ట్ యాప్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్బంగా ఆయనను అభిమానులు పలు ప్రశ్నలు అడిగారు. వాటికి మహేశ్ బదులిచ్చారు. బ్రహ్మోత్సవం చిత్రం ద్వారా గొప్ప నటులతో పనిచేసే అవకాశం లభించిందని ఈ సందర్భంగా మహేశ్ చెప్పారు. ఆ చిత్రంలోని పాటలన్నీ వినసొంపుగా మనసులకు హత్తుకునేలా ఉంటాయన్నారు. ముఖ్యంగా ఆ చిత్రం టైటిల్ సాంగ్ అంటే తాను చెవికోసుకోవడం ప్రారంభించానన్నారు. ఎన్నిసార్లు విన్నా వినాలనిపించేలా ఆ పాట ఉందని చెప్పారు. తన పట్ల అభిమానులు చూపుతున్న ప్రేమాభిమానాలకు మహేశ్ ధన్యవాదాలు తెలిపారు. రోజురోజుకు తన గ్రాఫ్ పెరుగుతోందంటే దానికి కారణం అభిమానులేనన్నారు. తన కుమారుడు గౌతం, కుమార్తె సితారలతో కలిసి ఏదైనా సినిమా చేయాలనే ఆలోచన ప్రస్తుతానికి లేదన్నారు. అసలు ఇంతవరకు అలాంటి తలంపే రాలేదని చెప్పారు. ప్రస్తుతం వారు చాలా చిన్నవారని, సినిమాల్లో నటన కారణంగా వారిపై ఒత్తిడి పెరుగుతుందని, అందుకే ప్రస్తుతానికి వారిని సినిమాలకు దూరంగా ఉంచుతున్నట్లు చెప్పారు.
చిన్ననాటి నుండి సీనియర్ నటుడు సత్యరాజ్ అంటే తనకు గౌరవమని ఆయనతో ప్రస్తుతం కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. సత్యరాజ్ చాలా సాధారణంగా సింపుల్ గా ఉంటారని అది తనకు నచ్చుతుందన్నారు. తోట తరణి వల్లే ఈ చిత్రంలో సెట్లకు నిండుదనం వచ్చిందని.. భారీ సెట్లను కన్నులకు ఆకట్టుకునేలా తీర్చిదిద్దడంలో ఆయనకు ఆయనే సాటి అన్నారు. బ్రహ్మోత్సవం ట్రైలరుకు వచ్చిన స్పందన చూసి తనకు అమితానందం కలుగుతోందని చెప్పారు. ట్రైలరుకు వచ్చిన స్పందన చూస్తుంటే ఈ చిత్రం అందరినీ ఆకట్టుకోనుందనే నమ్మకాన్ని తనకు కలిగిస్తుందన్నారు.
Mobile AppDownload and get updated news