వైద్య విద్యా కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన నీట్ పరీక్ష నిర్వహణకు అన్ని రాష్ట్రాలు సూత్రప్రాయంగా అంగీకరించాయి. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశ పరీక్షల విషయంలో దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమౌతున్న నేపథ్యంలో నీట్ పరీక్షపై ఢిల్లీలో జేపీ నడ్డా అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన అన్ని రాష్ట్రాలకు చెందిన వైద్యశాఖ మంత్రులు ఈ మేరకు అంగీకారం తెలిపారు. ఈ సమావేశంలో నీట్ పరీక్ష నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల అభ్యంతరాలపై జేపీ నడ్డా సుధీర్ఘంగా చర్చించారు. నీట్ నిర్వహణపై విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్న సందేహాలపై చర్చించారు. నీట్ పరీక్ష నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వాలు సూత్ర ప్రాయంగా అంగీకారం తెలుపుతూనే .. ప్రస్తుత ఏడాదికి మినహాయింపు ఇవ్వాలని కోరాయి. అలాగే ప్రాంతీయ భాషల్లోనూ పరీక్ష నిర్వహించాలని కోరాయి. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రుల అభ్యంతరాలను విన్న జేపీ నడ్డా..ఈ అంశాన్నిసుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. కాగా ఈ సమావేశంలో తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డి, ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ సహా దాదాపు 20 రాష్ట్రాల మంత్రులు, వైద్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Mobile AppDownload and get updated news