Mobile AppDownload and get updated news
స్వాతంత్య్రం వచ్చిన కొద్ది సంవత్సరాలకే భారతదేశం కన్ను అణ్వస్త్ర సంపదపై పడిందా.. 1964 తొలి నాళ్లకే మన దేశం అణ్వస్త్ర పరిజ్ఞానాన్ని సమకూర్చుకుందా? మనం తలచుకుంటే ఫోఖారాన్ పరీక్షలకన్నా ముందే 1965 సంవత్సరంలోనే అణ్వస్త్రాలను పరీక్షించి ఉండేవాళ్లమా? అవుననే అంటోంది అమెరికా నివేదిక ఒకటి. అమెరికా ప్రభుత్వం ఇటీవల బహిర్గతపరిచిన పత్రాల్లో ఈ విషయం ఉంది. అమెరికా నిఘా సంస్థ (ఐఎన్ఆర్) అధికారులు ఆ దేశ ప్రభుత్వంతో జరిపిన అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాల్లో ఒకదాంట్లో ఇలా ఉంది. '' భారతీయులు ప్రస్తుతం (1964వ సంవత్సరం నాటికి) అణ్వస్త్ర పరిజ్ఞానాన్ని సమకూర్చుకున్నారు. వారు (భారతీయులు) తలచుకుంటే ఇప్పటికిప్పుడే అణ్వస్త్రాలను అభివృద్ధి కూడా చేయగలరు. కానీ, ప్రస్తుతానికి మన వద్ద అందుకు తగిన ఆధారాలు పక్కాగా లేవు. కొద్ది కాలం ఆగితేకానీ ఒక నిర్ణయానికి రాలేము''అని ప్రభుత్వానికి నివేదించారు. ఇది జరిగిన సరిగ్గా పదేళ్లకు 1974లో ఇందిరాగాంధీ ప్రభుత్వం పోఖారాన్లో తొలి అణ్వస్త్రపరీక్షను నిర్వహించింది.