మన దాయాది దేశం పాకిస్థాన్ ఆయుధాగారం అంతా చైనా తయారీ ఆయుధాలతోనే నిండిపోయింది. ఒక్కటంటే ఒక్కటి కూడా ఆ దేశం సొంతంగా ఏ ఆయుధాన్ని తయారుచేసుకోవడం లేదు. చైనా నుండి అడిగిన వెంటనే వచ్చిపడుతున్న ఆయుధాలను చూసుకుని ఆ దేశం భారతదేశానికి పక్కలో బల్లెంలా మారి చీటికి మాటికి కయ్యానికి కాలుదువ్వుతోందని తాజాగా విడుదలైన నివేదిక ఒకటి బట్టబయలు చేసింది. స్వాతంత్ర్యం వచ్చిన తొలి నాళ్లలో చైనా మనదేశంతో మైత్రిగానే ఉండేది. కానీ, తదనంతర పరిణామాల్లో రెండు దేశాల మధ్య విభేదాలు పొడసూపాయి. అదే అదనుగా పాకిస్థాన్ చైనాకు దగ్గరయింది. ఇప్పుడా రెండు దేశాల మిత్రత్వం భారత్ కు ఇబ్బందిగా మారింది. ఆయుధాల సరఫరా నుండి అణ్వస్త్రాల తయారీ వరకు పాకిస్థాన్ కు చైనా చేస్తున్న సాయం ఇంతంతకాదు. ఇదే విషయాన్ని భారత నాయకత్వం ఎప్పటినుండో అంతర్జాతీయ సమాజం చెవిన ఇల్లుకట్టుకుని చెబుతూ వస్తోంది. ఇప్పుడదే సంగతిని తాజా మిలటరీ నిఘా నివేదిక తేటతెల్లం చేసింది. చైనా తయారీ ఆయుధాలకు తన దేశపు జాతీయ రంగును పులిమిన పాక్ వాటిని సరిహద్దుల్లో పెద్ద ఎత్తున మోహరించింది.
Mobile AppDownload and get updated news