Mobile AppDownload and get updated news
హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్కులో ఆదివారం నాడు ఒక రాజస్థానీ యువకుడు మద్యంమత్తులో సింహాల ఎన్‌క్లోజరులోకి దూకేసాడు. ఆ ఎన్‌క్లోజరులో రెండు పెద్ద సింహాలున్నాయి. పీకల్లోతు మద్యం సేవించిన ఆ యువకుడి పేరు ముఖేశ్. సింహాల ఎన్ క్లోజరు వద్ద తచ్చాట్లాడుతూ కనిపించిన ఆ యువకుడి పరిస్థితి గమనించిన జూ సిబ్బంది తొలుత హెచ్చరించారు. అయినా అతగాడు పట్టించుకోలేదు. జూ సిబ్బంది తమ విధుల్లో ఉండగా వారి కన్నుగప్పి ఎన్‌క్లోజరులోకి దూకేసాడు. దాంతో అక్కడున్న సందర్శకులు ఒక్కసారిగా షాకయ్యారు. అందులోని సింహాల నోటికి అతగాడి ప్రాణాలు హరీ అని అంతా భావించేసారు. జూ అంతా ఒక్కసారిగా కలకలం రేగింది. ఎన్‌క్లోజరులోని సింహాలు కూడా తమ బోనులోకి దూకిన ముఖేష్‌ను చూసి ఆసక్తిగా దగ్గరకు వెళ్లాయి. అతడికి దగ్గరగా వెళ్లి వాసన చూసి ఏమనుకున్నాయో ఏమో కానీ దూరంగా వెళ్లిపోయాయి. ఈలోపు జూ సిబ్బంది రంగంలోకి దిగి అతడిని సురక్షితంగా బయటకు తెచ్చారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషనుకు తరలించారు.