నీటితో తడిసి ముద్దయిన చెన్నై ఈ ఉదయం నుంచి కాస్త ఊపిరిపీల్చుకుంటోంది. వరద ఉద్ధృతి తగ్గడంతో పాటూ, కాస్త వాన తెరిపివ్వడంతో సాధారణ స్థితి కనిపిస్తోంది. అయితే మేడలు, మిద్దెలు మాత్రం నడుం లోతు నీళ్లలో అలాగే ఉన్నాయి. కాగా గత కొద్ది రోజులుగా నీటిలో మునిగిన విమానాశ్రయంలో విమాన సర్వీసులు రద్దయిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం కొన్ని విమాన సర్వీసులను పునరుద్ధరించే అవకాశం కనిపిస్తోంది. చెన్నై ఎయిర్ పోర్టు లో నీళ్లు ప్రవహిస్తుండడంతో అక్కడ నుంచి విమాన సర్వీసులు నడపడం అసాధ్యం. అందుకే అరక్కోణం ఎయిర్ పోర్టు నుంచి కొన్ని విమాన సర్వీసులు నడిపేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఓ ఏడు విమాన సర్వీసులను అందించేందుకు ఎయిరిండియా అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే ఇంకా రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండడంతో విమాన సర్వీసులు నడవడం అనుమానాస్పదమే.