మంగళవారం రాత్రి ముంబయి సిటీ పోలీసుల ట్విట్టర్ ఎకౌంట్ కు ఓ ట్వీటు వచ్చింది. ఆ ట్వీటు ఎవరు పంపారు? అందులో ఉన్న నిజమెంత? అనే విషయాన్ని తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. మంగళవారం రాత్రి 9 గంటలకు ఇయాద్ ఎల్ బాగ్దాదీ పేరుతో ఓ ట్వీటు వచ్చింది. అందులో 'ఇండియన్ అకౌంట్స్ నుంచి ఐసిస్‌లో ఎలా చేరాలి అని ప్రశ్నిస్తూ మెయిల్స్ వస్తే... ఆ విషయాన్ని ఎవరికి రిపోర్టు చేయాలి? ఈమెయిల్ ఐడీ ఏదైనా ఇస్తారా?' అని ట్వీటు సారాంశం. ఇయాద్ పేరుతో ఉన్న అకౌంట్ పరిశీలిస్తే... ఆ వ్యక్తి నార్వే లోని ఓస్లోలో ఉన్నట్టు పెట్టాడు. తానొక ఎంటర్ ప్రెన్యూర్, రచయిత అని కూడా ఎకౌంట్లో ఇన్ఫర్మేషన్ పెట్టాడు. అతనికి 79వేల మంది ఫాలోవర్స్ ఉండగా, అతను 2,097 మందిని ఫాలో అవుతున్నాడు. కాగా యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) ఆఫీసర్ మాట్లాడుతూ ఇలాంటి విషయాల గురించి ఎవరైనా ముంబయి పోలీసులకు, లేదా ఏటీఎస్, లా ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీకి సమాచారం అందిస్తే చాలని వారే చూసుకుంటారని తెలిపారు. ముంబయి పోలీసులు... ఎల్ బాగ్దాదీ పేరుతో ఉన్న ఎకౌంట్ నిజమైనదేనా... లేక దాని వెనుక డ్రామా దాగుందా అన్నది తేల్చే పనిలో ఉన్నారు. ఇండియా నుంచి ఐసిస్ వైపు ఆకర్షితులవుతున్న వారి సంఖ్య పెరగడం చాలా కలవర పెడుతోంది. జనవరిలో సిరియా సేనలు... నలుగురు భారత యువకులను అదుపులోకి తీసుకున్నాయి. వారు ఐసిస్ లో చేరేందుకు జోర్డాన్ మీదుగా సిరియాలోకి ప్రవేశించారు. గత ఏడాది డిసెంబర్లో ముగ్గురు యువకులు సిరియా వెళ్లేందుకు ప్రయత్నిస్తూ నాగ్ పూర్ ఎయిర్ పోర్టులో దొరికిపోయారు.
Mobile AppDownload and get updated news