మాతాజీగా మారిన బిగ్ బాస్ మాజీ పోటీదారు సోఫియా హయత్ ఈ మధ్యకాలంలో చిత్ర విచిత్రమైన ప్రకటనలతో తరచుగా వార్తలకెక్కుతోంది. తాజాగా ఈ మాజీ మోడల్ చేసిన ప్రకటన అందరూ ఇదేం చోద్యం అనుకునేలా చేసింది. తాను పరమశివుడికి జన్మనిచ్చానంటూ ఇటీవల ఈమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. మోడలుగా, నటిగా కెరియర్ మంచి ఊపుమీదున్న తరుణంలో సర్వం త్యజించి తనను తాను ఒక మాతాజీగా సోఫియా ప్రకటించుకున్నప్పుడు అంతా ఆశ్చ్యర్యపోయారు. సన్యాసినిగా మారిన తరువాత సోఫియా హయత్ ఔరంగాబాద్ లోని కైలాస దేవాలయాన్ని సందర్శించింది. దేవాలయంలోకి వెళ్లడం మాత్రమే తనకు తెలుసని, ఆ తరువాత తనకు ఏమైందో తెలియదని, తాదాత్మ్య స్థితిలోకి వెళ్లిపోయి గంటలపాటు ఊగిపోయానని సోఫియా చెప్పింది. శివలింగం ముందుకు వెళ్లగానే, అందులోనుండి వెలువడిన కిరణాలు తన శరీరంలోకి దూసుకుపోయాయంది. ఇందుకు సంబంధించి ఒక పోస్టును ఇన్‌స్టాగ్రామ్ లో పెడుతూ ' ఔరంగాబాద్ కైలాస దేవాలయం చాలా పవర్‌ఫుల్.. ఓం నమశ్శివాయ.. దేవాలయంలోని శివలింగం నుండి వచ్చిన ఆయాస్కాంత తరంగాల తాకిడికి నాకు ఊపిరి పీల్చుకోవడం కష్టమైపోయింది. నా శరీరంలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. దేవదేవుడు నాలోకి ప్రవేశించాడు. అవును, నాకు తెలుసు.. ఈరోజు నేను శివుడికి జన్మనిచ్చాను.' అని చెప్పింది. ఈ ప్రకటన విన్నవారంతా, ఇదేం చోద్యం, నీకు మతిగానీ పోయిందా ఏంటీ అని కామెంట్లమీద కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరు మాత్రం సోఫియాకు తమ మద్దతిచ్చారు. శివుడి దర్శనం అయినందుకు ఆమెకు అభినందనలు కూడా వస్తున్నాయి.
Mobile AppDownload and get updated news