Mobile AppDownload and get updated news
రియో ఒలంపిక్స్‌లో ఇవాళ జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ కేటగిరీ ఫైనల్ పోటీల్లో భారత షూటర్ అభినవ్ బింద్రా ఓటమి పాలయ్యాడు. 163.8 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచిన అభినవ్ బింద్రా పోటీల్లోంచి ఎగ్జిట్ అయ్యాడు. దీంతో షూటింగ్ విభాగం భారత్‌కి ఏ మెడల్‌ని అందించకుండానే నిరాశపర్చినట్టయింది. సోమవారం ఫైనల్ పోటీలు ప్రారంభమైన తొలి రౌండ్‌లో లక్ష్యాన్ని గురిపెట్టడంలో కాస్తంత తెగువ కనబర్చిన బింద్రా మూడో స్థానాన్ని సొంతం చేసుకునేందుకు అవకాశాలు మెరుగు పర్చుకున్నప్పటికీ... చివరలో స్కోర్‌లో వెనకబడటంతో నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో రష్యాకి చెందిన వ్లాదిమిర్ మస్లెన్నికోవ్ ఆ మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. మొదటి స్థానంలో నిలిచిన ఇటలీ షూటర్ నికోలో కంప్రైనీ గోల్డ్ మెడల్ గెలవగా, రెండో స్థానం సొంతం చేసుకున్న ఉక్రెయిన్ షూటర్ సెరీ కులిష్ సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నాడు.