Mobile AppDownload and get updated news
రియో ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు గ్రేట్ బ్రిటన్ చేతిలో ఓడిపోయింది. 36 ఏళ్ల తర్వాత ఒలింపిక్ బరిలోకి దిగిన మన టీమ్ తన సత్తా చాటేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పూల్-బిలో భాగంగా బ్రిటన్ తో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ ఒక్క గోల్ కూడా చేయకుండా నిష్ర్కమించాల్సి వచ్చింది. ఫస్ట్ క్వార్టర్ లో భారత్, గ్రేట్ బ్రిటన్ లు 0-0 స్కోరుతో సమానంగా నిలిచాయి. అయితే రెండో క్వార్టర్ లో బ్రిటన్ కు రెండు పెనాల్టీ షూటౌట్స్ రావడంతో గ్రేట్ బ్రిటన్ టీమ్ క్షణాల వ్యవధిలో రెండు గోల్స్ చేసింది. దీంతో స్కోర్ 0- 2 నమోదైంది. ఇక మూడో క్వార్టర్ లోనూ బ్రిటన్ మరో గోల్ చేయడంతో వారు మొత్తం మూడు గోల్స్ కు చేరుకుని ఆధిక్యంలో నిలిచారు. చివరి క్వార్టర్ లో మనవాళ్లకు ఓ పెనాల్టీ షూటౌట్ అవకాశం వచ్చింది. అయితే దాన్ని గోల్ చేయడంలో విఫలం అయ్యారు. దీంతో నాలుగో క్వార్టర్ లో ఎవరూ ఎలాంటి గోల్స్ చేయకున్నా విజయం మాత్రం బ్రిటన్ సొంతమైంది. గ్రేట్ బ్రిటన్ క్రీడాకారిణిలు నికోలా వైట్, గిసెల్లీ, అలెగ్జాండ్ర డన్సన్ రాణింపుతో విజయం వారి వైపు నిలిచింది. రియో ఒలింపిక్స్ లో పూల్-బిలో భాగంగా జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు జపాన్ పై తన శాయశక్తుల పోరాడి 2-2తో డ్రాగా ముగించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం బ్రిటన్ తో ఇలా చిత్తుగా ఓడిపోవడం బాధాకరం.