జీవితాంతం అవిభక్త కవలలుగానే వీణావాణి అవిభక్త కవలలు వీణావాణీలు ఇక జీవితాంతం అలా కలిసే బతుకుతారు. వారిని విడదీసే శస్త్రచికిత్స చేయించేందుకు ప్రభుత్వం సుముఖంగా లేదు. లండన్ డాక్టర్లు, ఆస్ట్రేలియా డాక్టర్లు వచ్చి వీణావాణీలను పరిశీలించారు. వారి వైద్య రికార్డులు కూడా చూశాక... విడదీయచ్చు కానీ... రిస్క్ తో కూడుకున్నదని... ఒకరే బతికే అవకాశం ఎక్కువని చెప్పారు. లేకుండా ఇద్దరూ కోమాలోకి వెళ్లే అవకాశం ఉందని చెప్పారు. ఇక ఢిల్లీలోని ఎయిమ్స్ కు చెందిన వైద్య బృందం అయితే... విడదీస్తే వారి ప్రాణానికే ప్రమాదమని ఖరాఖండిగా చెప్పేశారు. దీంతో తల్లిదండ్రులు, ప్రభుత్వం వెనుకంజ వేశాయి. ఇక వారికి శస్త్రచికిత్స చేయించడం గురించి ఎలాంటి చర్చలు ఉండకపోవచ్చు. ప్రభుత్వం ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వారిని పోషించలేమని చెప్పి తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లేందుకు నిరాకరిస్తున్నారు. ఇక నీలోఫర్ లో 12 ఏళ్లు దాటిన పిల్లలు ఉండేందుకు వీలు లేదని ఆ యాజమాన్యం తేల్చి చెప్పింది. దీంతో వీణావాణీలను స్టేట్ హోంకు తరలించనున్నారు. జీవితాంతం వారు అక్కడే ఉంటారు. వారి బాగోగులు, చదువు, వైద్య వసతి... ఇలా అన్ని ఖర్చులు, సదుపాయాలు ప్రభుత్వమే భరించనుంది. అందుక్కావాల్సిన ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు స్త్రీ శిశు సంక్షేమ శాఖకు ఉత్తరం రాసింది వైద్య ఆరోగ్య శాఖ. త్వరలోనే వారిని స్టేట్ హోమ్ కు తరలిస్తారు.
![]()
Mobile AppDownload and get updated news