బ్రిటిషర్ల కాలం నాటి బంకర్ మహారాష్ట్ర గవర్నర్ అధికారిక నివాస ప్రదేశమైన రాజ్ భవన్ దగ్గర బయటపడింది. అది బయటపడింది అనే కన్నా గవర్నర్ విద్యాసాగర్ రావు బయటపడేలా చేశారు అనడమే బాగుంటుంది. ఎందుకంటే ఆయనే పూర్వం అక్కడో బంకర్ ఉన్న సంగతి తెలుసుకుని... తవ్వించారు. దీంతో 13 గదులున్న బంకర్ బయటపడింది. పూర్తి వివరాల ప్రకారం... మహా గవర్నర్ నివాసమైన రాజ్ భవన్ ముంబైలోని మలబార్ హిల్స్ లో ఉంది. అందులో పనిచేస్తున్న క్లాస్ 4 ఉద్యోగి విలాస్ మోరె గవర్నర్ పీఏకి బంకర్ గురించి చెప్పాడు. వందేళ్ల క్రితమే దానిని మూసివేసి నేలపై గోడలా కట్టేశారని చెప్పాడు. అతని తండ్రి, తాత అక్కడే పనిచేశారు. వాళ్లే ఆ బంకర్ గురించి విలాస్ మోరెకి చెప్పారు. పీఏ ఆ విషయాన్ని గవర్నర్ కు చెప్పారు. గవర్నర్ విలాస్ మోరె చెప్పిన చోట గోడని తవ్వించారు. అప్పుడు బయటపడింది రాతితో కట్టిన బంకర్. ఆగస్టు 12న ఇదంతా జరిగింది.
![]()
ఆ బంకర్ లోపలికి దిగి మహా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, గవర్నర్ విద్యాసాగర్ రావు ఇటీవల పరిశీలించారు. అందులో మొత్తం 13 గదులు ఉన్నాయి. బ్రిటిషర్లు 1820-1885 మధ్యలో దానిని ఉపయోగించినట్టు భావిస్తున్నారు. ఆ గదులపై షెల్ స్టోర్, కాట్రిడ్జ్ స్టోర్, గన్ షెల్, షెల్ లిఫ్ట్, పంప్, వర్క్ షాప్ ఇలా రాసి ఉన్నాయి. లోపలికి స్వచ్ఛమైన గాలి వచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేసి ఉన్నాయి. దాదాపు వందేళ్ల క్రితం దీనిని మూసివేసి గోడ కట్టేశారు. ఆ బంకర్ ను మ్యూజియంగా మార్చాలని గవర్నర్ యోచిస్తున్నారు. ప్రజల సందర్శనార్థం అందుబాటులో ఉంచాలని ఏర్పాట్లు చేస్తున్నారు.
Mobile AppDownload and get updated news