ఎయిర్ ఫోర్స్ విమానం ఏఎన్ 32 తప్పిపోయి సరిగ్గా పాతిక రోజులు అవుతోంది. ఇప్పటికీ ఆ విమానానికి సంబంధించి చిన్న క్లూ కూడా దొరకలేదు. సముద్రంలో ఏఎన్ 32కి సంబంధించి చిన్న భాగం దొరికినా చాలు... అది కూలిపోయినట్టు ప్రకటించవచ్చు. కానీ అలాంటి విమాన భాగాలు దొరకలేదు. చెన్నైలోని తాంబరం నుంచి బయలుదేరిన 16 నిమిషాలకే ఏటీసీ తో విమానానికి సంబంధాలు తెగిపోయాయి. తాంబరం నుంచి పోర్ట్ బ్లెయిర్ మధ్యలో కేవలం బంగాళాఖాతం మాత్రమే ఉంది. కనుక ఆ విమానం సముద్రంలోనే కూలిపోయే అవకాశమే ఎక్కువ. కానీ ఆధారాలు లేకపోవడంతో కేంద్రం ప్రకటించలేకపోతోంది. ఆ విమానంలో 29 మంది సిబ్బంది ఉన్నారు. 8 మంది విశాఖ వాసులు కూడా ఉన్నారు. ఇస్రో కూడా గాలింపుకు సాయపడింది అయినా ఫలితం లేదు. సముద్రంలో తేలియాడిన 30 వస్తువులు, 24 ట్రాన్స్ మిషన్ సిగ్నళ్లను పరిశీలించారు. వాటితో ఏఎన్ 32కి ఎలాంటి సంబంధం లేదని తేలింది. ఇక కేంద్రమంత్రి సుభాష్ రామ్ రావు భామ్రే ఆ విమాన ప్రమాదంలో ఎవరూ సజీవంగా ఉండే అవకాశం లేదని కూడా లోక్ సభలో ప్రకటించారు. దీంతో కుటుంబసభ్యులు పూర్తిగా ఆశలు వదులుకున్నారు. గాలింపు ఇంకా కొనసాగుతోంది.
Mobile AppDownload and get updated news