భారత్‌లో క్రికెట్ కోసం ఎంతలా పడి చస్తారో.. బ్రెజిల్లో సాకర్ అంటే అదే తరహాలో అభిమానం చూపిస్తారు. అందుకు తగ్గట్టుగానే బ్రెజిల్ ఫుట్‌బాల్ జట్టు కూడా ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. కానీ ఒలింపిక్స్‌లో మాత్రం పసిడి పతకాన్ని ఒడిసి పట్టలేకపోయింది. ఈ లోటు ఆ దేశాన్ని ఎంత కాలంగానో వేధిస్తోంది. అయితే సొంత గడ్డపై జర్మనీతో జరిగిన ఒలింపిక్స్ ఫుట్‌బాల్ ఫైనల్ మ్యాచ్‌లో బ్రెజిల్ చిరకాల వాంఛ నెరవేరింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో నిర్ణీత సమయం ముగిసే సరికి బ్రెజిల్, జర్మనీ చెరో గోల్ సాధించి సమఉజ్జీలుగా నిలిచాయి. దీంతో ఎక్స్‌ట్రా టైమ్ తప్పలేదు. అదనపు వ్యవధిలోనూ ఫలితం తేలకపోవడంతో షూటౌట్‌కు దారి తీసింది. అందులోనూ ఇరు జట్లు తీవ్రంగా పోరాడాయి. షూటౌట్ తొలి నాలుగు రౌండ్లలోనూ ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు గోల్స్ చేశారు. ఈ దశలో చివరి గోల్ కోసం జర్మనీ చేసిన ప్రయత్నాన్ని బ్రెజిల్ గోల్‌కీపర్ సమర్థవంతంగా తిప్పికొట్టాడు. తర్వాత బ్రెజిల్ ఫుట్‌బాల్ టీం కెప్టెన్ నెయ్‌మర్ విజయవంతంగా గోల్ చేయడంతో 5-4 తేడాతో బ్రెజిల్ స్వర్ణ పతకాన్ని సాధించింది. గతంలో మూడుసార్లు ఒలింపిక్స్ గోల్డ్ మెడల్‌ను తృటిలో చేజార్చుకున్న బ్రెజిల్ ఈసారి మాత్రం స్వర్ణాన్ని సాధించింది. బ్రెజిల్ సాకర్ జట్టు విజయంతో ఆ దేశ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఓవరాల్‌గా ఫుట్‌బాల్‌లో ఒలింపిక్స్ మెడల్స్ విషయానికి వస్తే బ్రెజిల్ ఖాతాలో ఇప్పటికే ఉన్న మూడు రజతాలు, రెండు కాంస్యాలు ఉండగా.. అదనంగా ఇప్పుడు బంగారు పతకం చేరింది.
Mobile AppDownload and get updated news