Mobile AppDownload and get updated news
ఇన్నిరోజులుగా నవజ్యోతి సింగ్ సిద్ధు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరతారని సాగిన ప్రచారానికి తెరపడింది. తానే ఓ రాజకీయ వేదికన స్థాపించనున్నట్లు ప్రకటించారు. మరో ఐదు నెలల్లో పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నవజ్యోత్ సింగ్ నాయకత్వంలో 'ఆవాజ్-ఏ-పంజాబ్' పేరుతో కొత్త రాజకీయ వేదిక ప్రారంభం కానుంది. 'పర్గాత్ సింగ్, బయాన్ సోదరులతో కలిసి మేము ఒక రాజకీయ ఫ్రంట్ ను స్థాపించామని' సిద్ధు సతీమణి, బీజేపీ ఎమ్మెల్యే నవజ్యోత్ కౌర్ సిద్ధు ప్రకటించారు. వచ్చే వారమే తమ ఫ్రంట్ ను అధికారికంగా ప్రకటించి ప్రజల్లోకి వెళ్తామని ఆమె వెల్లడించారు. ఆగస్టులోనే సిద్ధులో ఆప్ లో చేరతారని జోరుగా ఊహాగానాలు సాగాయి. జూలైలోనే ఆయన బీజేపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆప్ లో తనను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తేనే చేరతానని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను డిమాండ్ చేసినట్లు వార్తలొచ్చాయి. ఈ వార్తలను కేజ్రీవాల్ ఖండించారు. సిద్ధు ఏలాంటి షరతులు విధించలేదని, ఆయన తమ పార్టీలో చేరడం సిద్ధు ఇష్టమని కేజ్రీవాల్ పేర్కొన్నారు. దీనికి తోడు ఇటీవల ఆప్ లో చోటుచేసుకున్న పరిణామాలు సిద్ధు పునరాలోచనలో పడేసినట్లు కనిపిస్తోంది. పంజాబ్ ఆప్ కన్వీనర్ ను తొలగించడం, ఎంపీ మన్ పార్లమెంటు సమావేశాల సందర్భంగా భద్రతపై వీడియో చిత్రీకరించడం, మొన్నటికి మొన్నం ఢిల్లీ మంత్రి సందీప్ కుమార్ సెక్సు టేపులు బహిర్గతం కావడం వంటి పరిణామాలన్ని వచ్చే పంజాబ్ ఎన్నికల్లో చూపే అవకాశముంది. ఇవన్నీ ఆప్ కు ప్రతికూలంగా మారాయి. వీటికి తోడు పంజాబ్ సిక్కులను ఆప్ దూరం పెట్టినట్లు వార్తలొచ్చాయి. వీటన్నింటి నేపథ్యంలో సిద్ధు ఆప్ లో చేరినా ఫలితం ఉండదని భావించే 'కొత్త ఫ్రంట్'కు తెరతీసినట్లు తెలుస్తోంది.