సాధారణంగా ఒక భాషలో తెరకెక్కించిన డైరెక్ట్ సినిమాకన్నా.. ఏదైనా ఇతర భాషల్లోకి డబ్ చేసిన డబ్బింగ్ మూవీకి అంతగా మార్కెట్ వుండదు. ఏదో మొక్కుబడిగానో లేక మహా అయితే ఓ మోస్తరు కలెక్షన్లతోనో నిర్మాతల్ని గట్టున పడేస్తుంటాయి ఈ డబ్బింగ్ సినిమాలు. కానీ సూపర్ స్టార్ రజినీకాంత్‌కి మాత్రం ఇటువంటి మార్కెట్ ప్రిన్సిపుల్స్ ఏవీ వర్తించవు. ఆయన నటించినవాటిలో చాలా సినిమాలు అన్ని భాషల ఆడియెన్స్‌ని అలరించడమేకాదు.. అన్ని భాషల్లోనూ రికార్డు కలెక్షన్లు వసూలు చేసిపెట్టాయి. అందుకే రజనీకి ఇండియాలోనేకాకుండా జపాన్, చైనా వంటి అగ్రదేశాలతోపాటు మలేషియా, సింగపూర్, థాయిలాండ్‌లలోనూ పెద్ద ఎత్తున అభిమాన సంఘాలున్నాయి. విదేశాల్లో అత్యధిక సంఘాలున్న ఇండియన్ హీరోగా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60,000లకిపైగా అభిమాన సంఘాలున్న ఏకైక ఇండియన్ హీరోగా రజినికాంత్‌కి మరో రికార్డు వుండటం విశేషం. ఈ విషయంలో ఎంతోమంది బాలీవుడ్ స్టార్స్ సైతం రజనీకన్నా వెనుకే వుండిపోయారు. ఒకానొక దశలో ఆసియాలోనే జాకీఛాన్ తర్వాత అత్యంత అధిక పారితోషికం తీసుకునే స్టార్‌గా రికార్డు సొంతం చేసుకున్నాడు రజినీ. సూపర్ స్టార్‌గా అతడి స్టామినా ఏంటో చాటిచెప్పే రికార్డు ఇది.
కెరీర్ తొలినాళ్లలోనే పాజిటివ్, నెగటివ్ పాత్రలతోపాటు మాస్‌కి మాస్, క్లాస్‌కి క్లాస్ సినిమాలు చేసి అన్నివర్గాల ఆడియెన్స్‌ని ఆకట్టుకున్నారు. అంతులేనికథ, ఆకలి రాజ్యం, ముత్తు, భాషా, నర్సింహ, అరుణాచలం, రోబో, శివాజీ వంటి మరెన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు రజనీకి ఎక్కడా లేని ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించిపెట్టాయి. పెదరాయడు సినిమాలో రజినీకాంత్ చేసిన పాత్ర ఆ సినిమాకే హైలైట్. లీడ్ రోల్ చేసింది మోహన్ బాబే అయినా... రజినీకాంత్ ఇచ్చిన గెస్ట్ అప్పీయరెన్స్ మాత్రం ఆ సినిమాకి ప్రాణం పోయడమేకాకుండా ఆ పాత్రకి ఎక్కడాలేని రాజసాన్ని తెచ్చిపెట్టింది. 60 ఏళ్ల ప్రాయంలో అత్యంత సాహాసోపేతమైన పాత్రలో శంకర్ దర్శకత్వంలో ఆయన చేసిన రోబో సినిమా ఇండియన్ సినిమాని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లింది. బాబా, కొచ్చాడయాన్, లింగా వంటి కొన్ని సినిమాలు రజనీ కెరీర్‌ని కొంత డిజప్పాయింట్ చేసినప్పటికీ.. అవేవీ ఆయనపట్ల వున్న క్రేజ్‌ని ఏ మాత్రం తగ్గించలేకపోయాయని చెప్పవచ్చు. అందుకు నిదర్శనమే మళ్లీ 'రోబో-2' త్వరలోనే సెట్స్పైకి వెళ్లనుండటం. తమిళనాడులో రజనీకాంత్‌కి వున్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి ఆయన ఎక్కడ రాజకీయాల్లోకి వస్తారోనని హడలిపోయిన రాజకీయ ఉద్దండపండితులూ వున్నారని తమిళతంబీలు చెబుతుంటారు. వివాదాలకి దూరంగా వుండే ఈ సింప్లీ సూపర్ స్టార్ ఇమేజ్ గురించి చెప్పడానికి ఇవి కొన్ని మచ్చుతునకలు మాత్రమే. ప్రస్తుతం యువ దర్శకుడు పా రంజిత్ డైరెక్షన్‌లో రజనీ చేస్తున్న సినిమా కబలి. తెలుగులో ఇదే సినిమాని తెలుగులో మహాదేవ్ పేరిట రిలీజ్ చేయనున్నారు. ఇవాళ తన 65వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సూపర్ స్టార్ ఇకపై కూడా మరెన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఆడియెన్స్‌కి అందించాలని మనసారా కోరుకుంటూ రజనీకాంత్‌కి బర్త్‌డే విషెస్ చెబుతోంది తెలుగు సమయం.
Mobile AppDownload and get updated news