ఇటీవల ఇటలీని అతలాకుతలం చేసిన భూకంపం వల్ల ప్రజలే కాకుండా జంతువులు కూడా బాధితులయ్యాయి. కనీవినీ ఎరుగని రీతిలో 6.2 మ్యాగ్నిట్యూడ్ తీవ్రతతో సంభవించిన భూకంపంతో ఇటలీ యావత్తు వణికిపోయిన సంగతి తెలిసిందే. కళ్లముందే పెద్ద పెద్ద భవనాలు కుప్పకూలిపోగా మూడు వందల వరకు వ్యక్తులు మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. పెద్ద సంఖ్యలో పౌరులు భవన శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారిని శిథిలాల కిందనుండి రక్షించేందుకు అగ్నిమాపకదళం సిబ్బంది రంగంలోకి దిగారు. ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ భూకంపం వల్ల మనుషులతో పాటు మూగజీవాలు కూడా బాధితులుగా మారాయి. అగ్నిమాపక సిబ్బంది భవనాల కింద చిక్కుకుపోయిన వారిని రక్షించే క్రమంలో, కుక్కల బౌబౌలు, పిల్లుల మ్యావ్ మ్యావ్ లు తరచుగా వినిపిస్తున్నాయి. వారు కూడా ఎంతో దయార్ధ హృదయంతో స్పందించి వాటిని కూడా జాగ్రత్తగా బయటకు తీస్తున్న తీరు అందరి ప్రశంసలు అందుకుంటోంది. శుక్రవారం నాడు జరిగిన సహాయక చర్యల్లో శిథిలాల నుండి పలు పిల్లులు, కుక్కలను కూడా సహాయక సిబ్బంది బయటకు తీశారు. పదిరోజులకు పైగా పాపం అవి తిండి లేక నీరసించి పోయి ఉన్నాయి. మరి కొద్ది రోజుల్లో చనిపోవడమే ఆలస్యం అనుకుంటున్న సమయంలో సిబ్బంది వాటి పాలిట దేవదూతలుగా మారి ప్రాణదానం చేసారు.