Mobile AppDownload and get updated news
ఉత్తరప్రదేశ్ లో నెలకొన్న వరద ముంపు వల్ల సమీప నదుల్లోని మొసళ్లు గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఆ రాష్ట్రంలోని మీర్జాపూర్ ప్రాంతంలోని గ్రామాల్లోకి అయితే ఈ మధ్య కాలంలో పలు మొసళ్లు ప్రవేశించి గ్రామస్తులకు ముచ్చెమటలు పోయిస్తున్నాయి. కొన్ని అయితే ఏకంగా ఇళ్లలోకి జొరపడి మంచాల కింద, వంటగదుల్లో తిష్ట వేస్తున్నాయి. మొసళ్లు రాత్రి వేళల్లో గ్రామాల్లోకి రావడం వల్ల గ్రామస్తులు పసిగట్టలేకపోతున్నారు. పగటివేళ అవి ఒక్కసారిగా తమ ఇళ్లలోనే అనుకోని అతిధుల మాదిరిగా దర్శనమివ్వడంతో ఉలిక్కిపడిన వాళ్లు బయటకు పరుగులు తీస్తున్నారు. గత రెండు నెలల్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 వరకు మొసళ్లు గ్రామాల్లోకి ప్రవేశించి గ్రామస్తులను బెంబేలెత్తించాయి. వాటిని చివరకు అటవీ శాఖ సిబ్బంది పట్టుకుని దూరంగా వదిలేశారు. ఇటీవల పట్టుబడిన మొసళ్లలో ఒకటి ఏకంగా 5 అడుగుల పైనే ఉండటం విస్తుగొలిపింది.