Mobile AppDownload and get updated news
యూరీ టెర్రర్ అటాక్ కు కారణమైన ఏ ఒక్కరిని విడిచిపెట్టబోమని భారత్ స్పష్టం చేసింది. ఉత్తర కశ్మీర్లోని యూరీ ఆర్మీ క్యాంప్‌పై ఆదివారం ఉదయాన్నే మిలిటెంట్లు దాడికి తెగబడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 17మంది జవాన్లు మరణించగా మరో పాతికమంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనను యావత్ దేశం ఒక్కతాటిపైకి చేరి ఖండించింది. ఎప్పటిలాగే కశ్మీర్ అంశం పరిష్కారానికి దేశంలోని వివిధ వర్గాలు తమదైన శైలిలో పరిష్కారాన్ని చూపాయి. కొందరు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని సూచించగా, మరికొందరు పాక్ పై గట్టి చర్యలు తీసుకుని బుద్ధి చెప్పాలనన్నారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ తీవ్రంగా స్పందించారు. దీన్ని పిరికిపందల చర్యగా వర్ణించారు. ఈ ఘటనలో పాల్గొన్న, పురగొల్పిన ఏ ఒక్కరిని జాతి క్షమించబోదన్నారు. వారికి తగిన గుణపాఠం చెప్పకుండా విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టరు ఖాతాలో ట్వీట్ చేశారు. యూరీ ఘటనలో అమరులైన జవాన్లకు జాతి తరఫున సెల్యూట్ చెప్పారు. వారి కుటుంబాలకు దేశం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.