Mobile AppDownload and get updated news
ఒక్క క్షణం ఆగితే ఆమె మెడలో మూడు ముళ్లు పడిపోతాయి. సరిగ్గా అదే సమయంలో ఆమెకు వరుడి దగ్గర నుండి ఏదో వాసన వచ్చింది.. పక్కనే స్థిమితంగా కూర్చోకుండా పదే పదే ఊగిపోతున్నాడు. అతగాడు పూటుగా మద్యం తాగి ఉన్నాడని ఆమెకు అర్థమైంది. అంతే చిర్రెత్తుకొచ్చిన ఆ యువతి తన చేతిలోని పూలదండను విసిరేసింది. ఇతగాడితో నేను మూడు ముళ్లు వేయించుకోను అంటూ పెళ్లి పీటల మీద నుండి ఒక్క దూకు దూకి కిందకొచ్చేసింది. కాన్పూర్ నగరానికి సమీపంలోని ఘతంపూర్ ప్రాంతంలో సోమవారం నాడు ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం రాత్రి ఆ యువతికి వివాహం జరగాల్సి ఉంది. వివాహానికి బంధు మిత్రులంతా తరలి వచ్చారు. అన్ని కార్యక్రమాలు, వివాహ తంతులన్నీ అయిపోయి.. దండలు మార్చుకుని.. తాళి కట్టేయడమే ఆలస్యం అనుకుంటున్న వేళ ఇది జరిగింది. తాగుబోతుని పెళ్లి చేసుకోనని బీష్మించింది. ఆమె నిర్ణయానికి ఆమె కుటుంబం కూడా మద్దతు పలికింది. అయితే, వరుడు మాత్రం ఆమెతో తనకు పెళ్లి జరగాల్సిందేనని ఘర్షణకు దిగాడు. దాంతో ఎవరో పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువురి మధ్య రాజీ కుదిర్చడంతో ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.