Mobile AppDownload and get updated news
కొత్తగా వివాహమైన జంటను.. కులసంఘం ఒకటి అన్నా చెల్లెలుగా చెపుతూ వారి వివాహాన్ని రద్దుచేస్తున్నట్లు ప్రకటించిన సంఘటన హర్యానాలో చోటుచేసుకుంది. హర్యానాలోని హిసార్ జిల్లాలోని సుల్ఖాని గ్రామంలో నివసించే నవీన్ కుమార్ అనే యువకుడు సంఘ గోత్రానికి చెందినవాడు. అతను బబితా అనే బుర గోత్రానికి చెందిన యువతిని ఈ నెల 6వ తేదీన వివాహమాడాడు. వివాహమైపోయి కొద్ది రోజులు కాపురం కూడా చేశాక ఖాప్ పంచాయితీ రంగంలోకి దిగింది. వారిద్దరి గోత్రాల ప్రకారం వరుసకు అన్నాచెల్లెల్లవుతారని చెపుతూ వివాహాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తమ నిర్ణయాన్ని పాటించకపోతే కుల బహిష్కారానికి గురికావలసి వస్తుందని కులపెద్దలు హెచ్చరించారు. అయితే, ఆ యువతి తండ్రి మాత్రం కులపెద్దల తీరును తప్పుపట్టారు. తమ గోత్రం, వరుడి గోత్రం వేరు వేరని, ఇద్దరి మధ్య అన్నాచెల్లెల్ల వరుస ఎలా కలుపుతారని ప్రశ్నిస్తున్నారు. వారి వ్యవహారం శృతిమించితే తాను పోలీసులను ఆశ్రయిస్తానని చెప్పారు.