తూర్పుచైనాలోని షాండాంగ్ ప్రోవిన్స్ కు చెందిన.. డుయువాన్ఫా అనే 84 ఏళ్ల వృద్ధుడికి జౌ యుఐ అనే భార్య ఉంది. వారి వివాహం 1959లో అయ్యింది. అయితే, వివాహమైన ఐదు నెలలకే ఆమెకు పేరు తెలియని వ్యాధి సంక్రమించింది. అప్పటికి ఆమె వయసు కేవలం 20 ఏళ్లే. తమ స్వస్థలానికి చాలా దూరంలోని ఒక గనిలో యువాన్ఫా కార్మికుడిగా పనిచేసేవాడు. తన భార్యకు పక్షవాతం సోకి మంచాన పడిందని బంధువులు లేఖ రాయడంతో హుటాహుటిన తన భార్య దగ్గరకు చేరుకున్న తరువాత వైద్యులు అతనికి చెప్పిన మాటలతో కుదేలైపోయాడు. ఆమె ఇక జీవితాంతం మంచంపైనే గడపాల్సిందేనని దాని సారాంశం. కొద్ది రోజులు గడిచిన తరువాత అతని కుటుంబీకులు, స్నేహితులు ఆమెకు విడాకులిచ్చేసి వేరే వివాహం చేసుకోమని సలహా ఇచ్చారు. కానీ అతని మనసు దానికి ఒప్పుకోలేదు. తనకు జీవనోపాధి కల్పించే గని ఉద్యోగాన్ని కూడా వదిలేసి తన భార్య దగ్గరే మకాం వేశాడు. స్థానికంగా వ్యవసాయపు పనులు చేస్తూ ఆమెకు సపర్యలు చేయడం మొదలుపెట్టాడు. ఆ క్రమంలో ఇప్పటికీ 56 ఏళ్లు గడిచాయి. 20 ఏళ్ల వయసులో మంచం ఎక్కిన అతని భార్య.. ఆ మంచంపైనే ఇప్పుడు వృద్ధురాలైపోయింది. ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో తనకు ఆమె పట్ల ప్రేమ పెరిగిందే కానీ ఇసుమంతైనా తగ్గలేదని యువాన్ఫా చెప్పాడు. ఒకవైపు పొలంలో పనిచేసి నాలుగు డబ్బులు సంపాదించడం, మరో వైపు పడకపై పడున్న భార్యకు చిన్న బిడ్డకు మాదిరిగా సపర్యలు చేయడం, స్పూనుతో ఆహారం తినిపించడం, స్నానాదికాలు చేయించడం అతని దినచర్యగా మారింది. ఈ ఆరు దశాబ్దాల కాలంలో తన భార్యకు చికిత్స చేయించేందుకు అతను తిరగని ఆసుపత్రి లేదని చైనా పత్రిక మెయిల్ ఆన్ లైన్ చెప్పింది. తన భార్యపట్ల అతని ప్రేమ చూసిన ఇరుగు పొరుగు వారు తరచుగా అతని ఇంటికి వెళ్లి ఔషధాలు, ఇంటికి ఉపయోగపడే నిత్యావసరాల్లాంటివి అందించడం ప్రారంభించారు.
Mobile AppDownload and get updated news