Mobile AppDownload and get updated news
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి సాక్షిగా జరగనున్న బాలయ్య కొత్త సినిమా డిక్టేటర్ ఆడియో లాంచింగ్ వేడుకకు ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. బాలక్రిష్ణ కెరీర్‌లో 99వ సినిమాగా తెరకెక్కుతున్న 'డిక్టేటర్'పై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలే వున్నాయి. తన తర్వాతి సినిమాతో సెంచరీ కొట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న బాలక్రిష్ణ కూడా రెట్టించిన జోష్‌తో కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 20వ తేదీ, ఆదివారం నాడు సాయంత్రం అమరావతిలో డిక్టేటర్ ఆడియో లాంచింగ్ ఫంక్షన్ జరగనుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చీఫ్ గెస్ట్‌గా రానున్న ఈ కార్యక్రమానికి ఎందరో సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. పెద్ద ఎత్తున వేడుకగా జరుపనున్న ఈ ఆడియో లాంచింగ్ ఫంక్షన్‌కి కొంత టీడీపీ ఫ్లేవర్ టచ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబుతోపాటు పార్టీకి చెందిన నేతలు చాలామంది డిక్టేటర్ ఆడియో లాంచ్‌ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు అమరావతికి వస్తున్నారని సమాచారం. శ్రీవాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఎరోస్ ఇంటర్నేషనల్ నిర్మిస్తోంది. నేటితో టాకీ పార్ట్ పూర్తయిందని, చివరిగా ఒక్క పాట మాత్రమే షూటింగ్ చేయాల్సి వుందని చెబుతూ డైరెక్టర్ శ్రీవాస్ ఫేస్‌బుక్‌లో ఇవాళే డిక్టేటర్ లేటెస్ట్ అప్‌డేట్స్‌ని పోస్ట్ చేశాడు. నందమూరి అభిమానులతోపాటు టీడీపీ శ్రేణులు మరోసారి అమరావతికి తరలిరానుండటంతో కొత్త రాజధానిలో డిక్టేటర్ హంగామా కనిపిస్తోంది.