మూడేళ్ల క్రితం డిసెంబర్లోనే 23 ఏళ్ల నిర్భయను అతి కిరాతకంగా లైంగిక వేధింపులకు గురిచేసి ప్రాణం పోయేలా చేశారు ఆరుగురు దుండుగులు. అందులో ఒకడు పద్దెనిమిదేళ్ల లోపు వాడు కావడంతో శిక్షను పూర్తి చేసుకుని ఆదివారం బయటి ప్రపంచంలోకి విడుదలయ్యాడు. కానీ ఆ కీచకుడు ఎక్కడికి వెళతాడు? ఇదే ఇప్పుడు అందరి ముందు ఉన్న ఆసక్తికరమైన ప్రశ్న. అతని సొంతూరు భవానీ పూర్ నాగ్లా అనే చిన్న గ్రామం. 1500 మంది జనాభా. అతని కుటుంబం అక్కడే నివసిస్తోంది. కానీ గత పదేళ్లుగా కుటుంబాన్ని చూడడానికి కూడా వెళ్లలేదంట ఈ నేరస్థుడు. అంతేకాదు ఊళ్లో ఉన్న అతని బంధవులు కూడా 'వాడు ఇక్కడికి రావద్దు' అనే కోరుకుంటున్నారు. అయితే వారికి ఆ నిందితుడు విడదలైన విషయం అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదు. కేవలం మీడియా వల్లే తెలిసింది. దీంతో ఊరంతా ఒక దగ్గర కూర్చుని ఇదే విషయమై చర్చించుకుంటోంది. గ్రామస్థులు కూడా నిందితుడిని ఊళ్లోకి రానివ్వడానికి ఒప్పుకోబోమని తేల్చేశారు. ఊళ్లో ఆడపిల్లలకి రక్షణ కరవవుతుందని అంటున్నారు. 'గత పదేళ్లుగా అతడు తన కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు. అలాంటిది ఇప్పుడెలా వస్తాడు? వచ్చినా కూడా ఇక్కడ అతనికి ఎలాంటి ఉపాధి దొరకదు. కనుక తన ముఖాన్ని పోల్చుకోని సిటీలలోనే బతుకుదెరువు వెతుక్కోవడం మంచిది' అని ఊరి పెద్ద వ్యాఖ్యానించారు. అలాగే ఢిల్లీలో తెలిసిన వాళ్ల ద్వారానే పని వెతుక్కోవాలి... కానీ ఏ స్నేహితుడూ అతన్ని తన గదిలో రూమ్మేట్ గా ఉంచుకోవడానికి ఇష్టపడడు అని ఢిల్లో కూలిపనులకు వెళ్లిన గ్రామస్థుడు తెలిపాడు. మరి ఈ కీచకుడు ఎక్కడి వెళతాడో చూడాలి.
Mobile AppDownload and get updated news