రష్యా సహకారంతో నిర్మించాలని తలపెట్టిన కొత్త అణు విద్యుత్ ప్లాంట్లను ఆంధ్ర ప్రదేశ్‌లో నిర్మించేందుకు కేంద్రం యోచిస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక రూపొందిందని వార్తలు వచ్చాయి. కూడంకుళం అణువిద్యుత్ కేంద్ర విస్తరణలో భాగంగా ఆంధ్రలో ఐదు, ఆరో యూనిట్లను నిర్మించేందుకు రష్యాకు స్థలాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. ప్రధాని మోడీ రష్యా పర్యటనలో ఈ అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు. మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేకిన్ ఇండియాలో భాగంగా కొత్త అణు ప్లాంట్లలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని భారత్ భావిస్తోంది. ఈ మేరకు ఇరు దేశాలు ఒక ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ అణు ప్లాంట్ల స్థాపనకు సంబంధించిన స్థలాలు కూడా ఖరారైపోయాయని కేంద్ర వర్గాలు తెలిపాయి. ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల 23, 24 తేదీల్లో రష్యా పర్యటనకు వెళ్తున్నారు. తన పర్యటన సందర్భంగా ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ తో మాస్కోలో జరిగే శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు.
Mobile AppDownload and get updated news