Mobile AppDownload and get updated news
జల్లికట్టుపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ క్రీడలో ఎద్దులు తీవ్ర హింసకు గురవుతున్నాయని పేర్కొంటూ మానవతావాదులు, జంతసంరక్షణా సంస్థలు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ ను విచారిస్తూ సుప్రీం కోర్టు అంతకుముందు కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసిన నిషేధంపై స్టే విధించింది. దీంతో పొంగల్ జల్లికట్టు ఆడాలో వద్దో పెద్ద ప్రశ్నార్థకమైంది. బుధవారం తమిళనాడు ముఖ్యమంత్రిి జయలలిత జల్లికట్టును అనుమతిస్తూ ఆర్డినెన్స్ తేవాలని ప్రధానికి లేఖ రాశారు. దీనిపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ట్విట్టర్లో స్పందించారు. సంక్రాంతి సందర్భంగా జల్లికట్టును అనుమతిస్తూ కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేయలేదని ట్వీటు చేశారు. ఈ అంశం సుప్రీం కోర్టు పరిధిలో ఉన్నందును తాము ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేమని పేర్కొన్నారు. కావాలంటే... రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసుకోవచ్చని ట్వీటు చేశారు. రాజ్యాంగంలో ఉన్న దాని ప్రకారం ప్రదర్శనలు, మార్కెట్ విషయంలో ఆర్డినెన్సు తేవచ్చని గుర్తు చేశారు. జల్లికట్టు ప్రదర్శన కిందకే వస్తుంది కనుక, రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్సు జారీచేసుకోవచ్చని అన్నారు.