Mobile AppDownload and get updated news
అనుకున్నదొక్కటి... అయినది ఒక్కటి ... అంటే ఇదేనేమో. ఏదో ఆశించి... ఫేస్‌బుక్ లో ఫోటో పెడితే, ఆ ఫోటో కష్టాలను తెచ్చిపెట్టింది. ఏకంగా ఎమ్మెల్యే టిక్కెట్టునే పోగొట్టింది. వివరాలు మీరే చదవండి. ఉత్తరప్రదేశ్ లో 2017 అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దానికి మాయావతి ఇప్పటి నుంచే సిద్ధమైపోతోంది. అందులో భాగంగా అట్రైలీ అనే నియోజకవర్గం నుంచి సంగీతా చౌదరిని నిలబెట్టాలని నిర్ణయించింది. ఆమెకు ఎలాంటి రాజకీయ అనుభవం లేదు, కాకపోతే ఇదే పోటీ నుంచి గతంలో సంగీత భర్త ధర్మేంద్ర పోటీ చేశాడు. ఆయన గతేడాది హత్యకు గురయ్యాడు. దాంతో అతని భార్య అయిన సంగీతనే అక్కడ అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించింది మాయావతి. సంగీత ఆనందం పట్టలేక ఒక ఫోటోను ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. ఆ ఫోటో సంగీత, ఆమె పిల్లలు మాయా కాళ్లకి మొక్కుతున్నట్టుగా ఉంది. ఆ ఫోటో ప్రత్యర్థి పార్టీలకి అస్త్రంలా దొరికింది. రకరకాల విమర్శలు కూడా తలెత్తాయి. దీంతో మాయాకు కోపమొచ్చి, సంగీతకు టిక్కెట్ ఇవ్వనని చెప్పేసింది. క్రమశిక్షణ చర్యగా టిక్కెట్ ను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. అయితే సంగీత మాత్రం తాను మాయావతితో ఉన్న ఫోటో పెట్టుకుంటే గెలుపు దక్కుతుందనే ఉద్దేశంతో పెట్టానని చెబుతోంది. ఏదేమైనా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మాయా మేడమ్ మనసు కరిగేట్టు కనిపించడం లేదు.