Mobile AppDownload and get updated news
వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు. కానీ, చాలా సందర్భాల్లో ఆ వైద్యులే రోగులు, విపత్కర పరిస్థితుల్లో ఉన్న అభాగ్యుల ప్రాణాలకు యముళ్లుగా తయారవుతున్నారు. తాజాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక ప్రభుత్వాసుపత్రి వైద్య సిబ్బంది వ్యవహరించిన తీరు వైద్య వృత్తికి కళంకం తెచ్చింది. లఖీంపూర్ జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన మైనర్ బాలికకు మతి స్థిమితం లేదు. ఆ బాలిక ఇటీవల పొలంలో ఆడుకుంటున్న సమయంలో ఒకడు అటకాయించి పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. రక్తస్రావమై, తీవ్రమైన బాధతో ఆ బాలిక కేకలు వేయడం ప్రారంభించడంతో ఆమెను వదిలిపరారయ్యాడు. ఆమె అరుపులకు అక్కడికి చేరుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు బాలికను వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించగా ఆ అభాగ్యురాలిని ఆసుపత్రిలో చేర్చుకోవడానికి చాలా సేపు సిబ్బంది నిరాకరించారు. కనీసం స్ట్రెచరుపై ఆమెను పరుండబెట్టేందుకు కూడా అంగీకరించలేదు. దాంతో ఒక పోలీస్ అధికారి స్వయంగా ఆ బాలికను తన చేతులతో మోయాల్సి వచ్చింది. పోలీసులు ఎంతగానో బతిమాలిన తరువాత చివరకు ఎప్పటికో చేర్చుకున్నప్పటికీ వైద్యం వెంటనే మొదలుపెట్టలేదు. ఈ స్థితిలో ఆ బాలిక అనుభవించిన బాధ వర్ణణాతీతంగా మారింది. తీవ్రంగా గాయపడి రక్తమోడుతూ ప్రాణాలు పోయే స్థితిలో ఉన్న బాలికకు మానవత్వంతో చికిత్స చేయకుండా నిరాకరించిన సిబ్బంది తీరు చూసిన ప్రజలు దుమ్మెత్తిపోశారు.