గృహహింస వేధింపులు ఎదుర్కుంటున్న వారిలో సాధారణ మహిళలే కాకుండా సెలబ్రిటీలు కూడా వున్నారనే విషయం మరోసారి రుజువైంది. ప్రముఖ తెలుగు నేపథ్యగాయని కౌసల్య తనని భర్త వేధిస్తున్నాడంటూ పోలీసులని ఆశ్రయించింది. తనని ప్రేమించి పెళ్లి చేసుకున్న బాలసుబ్రహ్మణ్యం గత కొంత కాలంగా వేధింపులకి గురిచేస్తున్నాడంటూ మంగళవారం ఆమె సంజీవరెడ్డినగర్ పోలీసులకి ఫిర్యాదు చేసింది. కాపురంలో విభేదాల కారణంగా గత రెండేళ్లుగా ఈ ఇద్దరూ వేర్వేరుగానే వుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈమధ్య తన భర్త తరచు ఫోన్ చేసి బెదిరింపులకి పాల్పడుతున్నట్లుగా ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. కౌసల్య ఫిర్యాదుతో సెక్షన్ 506, 507ల కింద కేసు నమోదు చేసిన ఎస్సార్ నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదిలావుంటే కౌసల్య భర్త బాలసుబ్రహ్మణ్యం మాత్రం ఆమె ఆరోపణలని కొట్టిపారేస్తున్నారు. తన ప్రతిష్టని దెబ్బతీసేందుకే కౌసల్య ఈ ఆరోపణలు చేస్తోందని గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న బాలసుబ్రహ్మణ్యం చెబుతున్నారు.
Mobile AppDownload and get updated news