Mobile AppDownload and get updated news
వివాదాస్పదమైన పీఎఫ్ విత్‌డ్రాల కొత్త నిబంధనలపై కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ప్రస్తుతానికి ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు మంగళవారం సాయంత్రం ప్రకటించింది. పీఎఫ్ విత్‌డ్రాలపై నిబంధనలను కఠినతరం చేస్తూ కేంద్రం ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుండి దేశ వ్యాప్తంగా కార్మికులు, ఉద్యోగ సంఘాలవారు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. చాలా చోట్ల పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. బెంగలూరులో కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా ఐదు లక్షల మంది ఆందోళన నిర్వహించగా అది హింసాయుతంగా మారింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బలప్రయోగానికి కూడా సిద్ధపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీరుపై ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శలకు దిగాయి. దీంతో ప్రభుత్వం దిగివచ్చింది. కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ హుటాహుటిన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటుచేసి పీఎఫ్ నిర్ణయాన్ని వెనక్కుతీసుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం పాత నిబంధనలే కొనసాగుతాయని తెలిపారు.