Mobile AppDownload and get updated news
తనను కాదని వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్న ప్రియుడిని నమ్మించి... ఆత్మహత్య చేసుకునేలా చేసింది ఓ ప్రేయసి. దీంతో పెళ్లి జరిగిన రెండో రోజే ఓ నవ వరుడు కన్నుమూశాడు. కాళ్ల పారాణి ఆరకముందే ఓ నవ వధువు జీవితం కరిగిపోయింది. పూర్తి వివరాల ప్రకారం...గుంటూరు జిల్లా ఈపూరు గ్రామానికి చెందిన వెంకటేశ్, అదే గ్రామానికి చెందిన ఓ యువతి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి వెంకటేశ్ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో ప్రేమికులిద్దరూ కూడా దూరంగా ఉండసాగారు. ఈ క్రమంలో వెంకటేశ్ కు మరదలితో వివాహం చేశారు. వివాహం అయిన మరుసటి రోజు ప్రియురాలి సోదరులు ఇద్దరు ఇచ్చి వెంకటేశ్ మందు పార్టీకి పిలిచారు. అతని చేత బాగా మద్యం తాగించి... తన సోదరికి ఎందుకు పెళ్లి చేసుకోలేదంటూ గొడవకు దిగారు. ఆమెను తీసుకువచ్చి వెంకటేశ్ ఎదుట నిల్చోబెట్టి వెళ్లిపోయారు. తనను మోసం చేసి వేరొక అమ్మాయిని పెళ్లాడవంటూ ప్రియురాలు నిందించింది. కలిసి బతకలేం కనుక... కలిసి చనిపోదామంటూ ప్రతిపాదించింది. మద్యం మత్తులో ఆమె మాటలు నమ్మాడు వెంకటేశ్. పురుగుల మందు రెండు గ్లాసుల్లో పోశారు. మొదట వెంకటేశ్ తాగాడు. ప్రియురాలు మాత్రం తాగకుండా... తనకు మోసం చేసినందుకు శిక్ష విధించానని, చావమని చెప్పి వెళ్లిపోయింది. వెంకటేశ్ ఇంటి తిరిగి వచ్చి కడుపునొప్పి వస్తోందని తల్లిదండ్రులు చెప్పాడు. గట్టిగా నిలదీసే సరికి అసలు విషయం చెప్పాడు. వెంటనే అతడిని ఆసుపత్రిలో చేర్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం అతని ప్రియురాలు పరారీలో ఉంది. ఆమె కోసం గాలిస్తున్నారు పోలీసులు. వెంకటేశ్ ను పెళ్లి చేసుకున్న అమ్మాయి కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.