Mobile AppDownload and get updated news
జైపూర్ కు ఒక్కరోజు పాటూ పోలీస్ కమిషనర్ గా పనిచేసిన గిరీష్ శర్మ ఇక లేడు. పదకొండేళ్ల గిరీష్ గతేడాది ఏప్రిల్ 30న ఒక్క రోజూ పాటూ కమిషనర్ గా పనిచేశాడు. ఈ పిల్లాడు కిడ్నీ సంబంధం వ్యాధితో బాధపడుతున్నాడు. తండ్రి చిరు వ్యాపారి. హర్యానాలోని సిస్రా గ్రామం వీరిది. ప్రాణాంతక వ్యాధి కబళిస్తోందని తెలిసినా గిరీష్ చిరునవ్వుతో ఉండేవాడు. జైపూర్ లోని జేకే లోక్ ఆసుపత్రిలో గతేడాది నెల రోజుల పాటూ చికిత్స చేయించుకున్నాడు. ఆ సమయంలో మేక్ ఏ విష్ సంస్థ ప్రతినిధులకు గిరీష్ గురించి తెలిసి వెళ్లి కలిశారు. తన కోరిక ఏంటని అడిగితే... పోలీసు అవ్వాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు. కమిషనరేట్ వారితో మాట్లాడి ఒక్కరోజు పాటూ గిరీష్ ను జైపూర్ కమిషనర్ గా నియమించారు. ఉత్తర్వులు అందుకున్న కమిషనరేట్ ఉద్యోగులు చిన్నారిని నిజమైన ఉన్నతోద్యోగిలాగే గౌరవించారు. వారందరికీ ఇప్పుడు గిరీష్ మరణించాడని తెలిసి విచారం వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి పరిస్థితి విషమించడంతో గిరీష్ తండ్రి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు బతకడం కష్టమని చెప్పడంతో... తండ్రి తిరిగి ఇంటికి తీసుకొస్తుంటే మధ్యదారిలో గిరీష్ తుదిశ్వాస విడిచాడు.