బ్యాంకుల నుండి వేల కోట్ల రూపాయిలు రుణాలుగా పొంది వాటిని తీర్చకుండా దేశం విడిచి పారిపోయిన విజయ్ మాల్యా, స్వదేశానికి తిరిగి రావడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూనే ఒక షరతు పెట్టాడు. బెంగలూరు రాయల్ చాలెంజర్స్ జట్టు గనుక చెత్తగా బౌలింగ్ చేయడాన్ని మానుకుని, అద్భుతంగా బౌలింగ్ చేయడం ప్రారంబిస్తే, తాను భారత్ రావడమే కాకుండా, చేసిన అప్పులన్నీ తీర్చేస్తానని ఆ షరతు సారాంశం. ఇదే విజయ్ మాల్యా భారత్ లో తనకు స్వేచ్ఛ, రక్షణను హామీగా ఇస్తే తిరిగి రావడానికి తనకేమి అభ్యంతరం లేదని కొద్ది రోజుల క్రితం షరతు పెట్టిన సంగతి తెలిసిందే. దాని తరువాత ఈ బౌలింగ్ షరతు రెండోది.
'ఈ విషయమై(రాయల్ చాలెంజర్స్ చక్కగా బౌలింగ్ చేసే విషయమై) బ్యాంకులకు నేనేమీ డెడ్ లైన్ పెట్టడం లేదు. వారు వాళ్ల ఇష్టం వచ్చినంత సమయం తీసుకోమనండి. ఆర్.సి.బి. జట్టు బౌలింగ్ బాగా చేసే వరకు.. అవసరమైతే పదేళ్లయినా కూడా నేను లండన్లో వెయిట్ చేయగలను, అని గుర్తుతెలియని ప్రాంతం నుండి విడుదల చేసిన మీడియా ప్రకటనలో తెలిపాడు. అయితే, దీన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం తోసిపుచ్చింది. మాల్యాకు స్వదేశానికి తిరిగివచ్చే ఉద్దేశం లేదని, అందుకే ఆయన ఇలాంటి అలవికాని షరతులు పెడుతున్నారని ఆరోపించింది. ఆర్.సి.బి. జట్టు బాగా బౌలింగ్ చేసేదీ లేదు.. మాల్యా దేశానికి తిరిగివచ్చి మా అప్పులన్నీ తీర్చేదీ లేదు అని బ్యాంకు ప్రతినిధి తేలిగ్గా తీసిపారేసారు. సాధ్యంకానీ షరతులతో మాల్యా అందరిని తప్పుదోవపట్టిస్తున్నారన్నారు. ఈ ఒక్క షరతు చాలు.. అతగాడు భారతదేశానికి తిరిగి రాడని.. మా అప్పులను తీర్చబోడని చెప్పేందుకు అని విశ్లేషించారు.
ఉదయ్ చోప్రా ఆస్కార్ అవార్డు కొట్టేందుకు, ఉస్సేన్ బోల్టును ఇంజమామ్ ఉల్హక్ 100 మీటర్ల పరుగులో ఓడించేందుకు అవకాశాలుంటే ఉండవచ్చేమో కానీ.. ఆర్.సి.బి. మాత్రం చక్కగా బౌలింగ్ చేయడం మాత్రం జరగని పని అన్నారు. ఆర్.సి.బి. బౌలింగ్ బాగా చేస్తే ఇండియాకు వస్తానని షరతు పెట్టిన మాల్యా, రేపు కేజ్రీవాల్ ప్రధానమంత్రి నరేంద్రమోడీని విమర్శించడం మానుకున్న రోజున తిరిగివస్తాననే షరతు పెట్టడని గ్యారంటీ ఏంటీ అన్నారు. ప్రధానిని కేజ్రీవాల్ తిట్టడం ఎప్పుడు ఆపుతారు.. ఇది జరిగే పనేనా? అని ఆయన ప్రశ్నించారు. ఇదిలా ఉండగా, ఈ షరతుపై ఆర్.సి.బి. జట్టు స్పందించింది. మాల్యా షరతు తమపై మరింత బాధ్యతను మోపిందని చెప్పింది. రానున్న రోజుల్లో కూడా చెత్త చెత్తగా ఆడి, మా చెత్త బౌలింగును ఇంకా దిగజార్చుకుంటామని మాల్యాకు మాటిస్తున్నామని జట్టు సభ్యుడొకరు హామీ ఇచ్చాడు. మరింత చెత్తగా బౌలింగ్ ఎలా చేయాలనే దానిపై ఇషాంత్ శర్మ నుండి సలహాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నామన్నాడు.
Mobile AppDownload and get updated news