Mobile AppDownload and get updated news
జవసత్వాలుడికిపోయిన చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనికిరారని మంగళవారం నాటి ఢిల్లీ పర్యటన తరువాత తెలిసిపోయిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ రఘువీరారెడ్డి విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురాలేని ముఖ్యమంత్రి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటేనన్నారు. బాబును దించేసి ఆయన స్థానంలో వేరొక నేతను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని రఘువీరా తెదేపా శాసన సభా పక్షానికి సూచించారు. ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి అక్కడ లేని పోని గొప్పలకు పోయారని.. ఇలా లేనిపోని గొప్పలు చెప్పుకుంటే కేంద్రం సాయం ఎలా చేస్తుందని ప్రశ్నించారు. కరవు నివేదికను పంపే విషయంలో ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యం ఇంతంత కాదన్నారు. ఎప్పుడో సెప్టెంబరు నెలలో పంపాల్సిన నివేదికను తీరిగ్గా ఫిబ్రవరిలో పంపారన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అక్రమ ప్రాజెక్టుల గురించి కూడా బాబు ప్రధాని ముందు ప్రస్తావించలేదని విమర్శించారు.