Mobile AppDownload and get updated news
ఏడు వారాల నగలు అంటే మొత్తం బంగారు నగలే అనుకుంటుంటారు మహిళలు. అవి ఏదో డబ్బున్న వాళ్లు మాత్రమే ధరించగలరు అనుకుంటే పొరపాటు. ప్రతి ఒక్క మహిళ వీటిని ధరించవచ్చు. అంతేకాదు గ్రహాల అనుగ్రహం కూడా పొందవచ్చు. అదెలాగో మీరే చూడండి. వారంలో ఏడు రోజులుంటాయి ఒక్కో రోజుకు ఒక గ్రహాధిపతి ఉంటాడు. ఉదాహరణకు ఆదివారానికి సూర్యుడు అధిపతి అయితే శుక్రవారానికి శుక్రుడు అన్నట్లు.. ఆయా వారాలను బట్టి ఆ రోజుకి ఉండే గ్రహాధిపతిని అనుసరించి నగలు ధరిస్తే మంచిదట. ఆదివారం సూర్యనికిష్టమైన రోజు కాబట్టి ఆ రోజున కెంపులతో చేసిన నగలు, హారాలు, చెవిపోగులు ధరించడం ద్వారా శుభ ఫలితాలుంటాయి. సోమవారం చంద్రునికి ఇష్టమైన రోజు కాబట్టి ముత్యాలతో తయారు చేసిన ఆభరణాలు ధరించడం శ్రేష్ఠం. ఇక మంగళవారం కుజుడికిష్టమైనది. ఆ రోజున పగడాలతో చేసిన నగలు ధరించవచ్చు. బుధుడికిష్టమైనది బుధవారం. ఆ రోజు ఆయనకిష్టమైన పచ్చ రంగు హారాలు, గాజులు ధరించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయట. గురువారం బృహస్పతిది. అందుకే గురువారం రోజు పుష్పరాగంతో చేసిన చెవిపోగులు, ఉంగరాలు ధరించాలి. శుక్రవారం శుక్రుడికిష్టమైనది కాబట్టి.. వజ్రాల హారాలు, ముక్కుపుడుక ధరించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందవచ్చట. శనివారం శనిభగవానుడికి ఇష్టమైన రోజు కాబట్టి ఆయనకిష్టమైన నీలమణి నగలు ధరించాలట. నీలంతో చేసిన కమ్మలూ, నగలు, ముక్కుపుడుకా పెట్టుకోవచ్చట.