Mobile AppDownload and get updated news
ఈ ఏడాది ఎండలు బాగానే మండాయి. అదే విధంగా వర్షాలు కూడా భారీగానే కురుస్తున్నాయి. కిందటేడాదితో పోలిస్తే... ఈ ఏడాది వర్షాలు బాగా పడుతున్నాయి. కారణం నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వ్యాపించి ఉన్న సమయంలోనే... బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడడం, ఉపరితల ఆవర్తనాలు వ్యాపించి ఉండడం... ఇలాంటి కారణాలతో వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. గత పదిరోజులుగా తెలుగు రాష్ట్రాలు తడిసిముద్దవుతూనే ఉన్నాయి. కాగా తాజాగా ఆదివారం బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడనం ఏర్పడింది. దీనిని అనుబంధంగా సముద్రమట్టానికి నాలుగున్నర కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కదులుతోంది. వీటి ప్రభావాల వల్ల సోమవారం కూడా కోస్తా, తెలంగాణాలో భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది. ఆదివారం సాయంత్రం నుంచి వర్షాలు ఆగి ఆగి పడుతూనే ఉన్నాయి. సోమవారం కూడా పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అల్పపీడనం వల్ల తీరం వెంబడి గంటలకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని వారు తెలిపారు.