తెలంగాణ రాష్ట్రంలో నవజాత శిశువులకు యాంటీబయోటిక్స్ అత్యధికంగా వాడుతున్నారట... ఈ విషయం యునిసెఫ్ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులతో అనుసంధానమైన నవజాత శిశువుల సంరక్షణా కేంద్రాల్లో అధిక స్థాయిలో యాంటీ బయోటిక్స్ ను చిన్నారులకు ఇస్తున్నట్టు అధ్యయన నివేదిక చెబుతోంది. అక్కడ పనిచేసే ప్రభుత్వ డాక్టర్లు 98 శాతం మేరకు పిల్లలకు ఇలా అధిక డోసులో యాంటీ బయోటిక్స్ ఇస్తున్నారు. ఇలా ఇవ్వడం వల్ల భవిష్యత్తులో వారికి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ అధ్యయానికి యునిసెఫ్ 'యాంటీబయోటిక్స్ యూసేజ్ రేట్ ఎక్రాస్ ఎస్ఎన్‌సీయూ ఇన్ తెలంగాణా' అని పెట్టారు. అంటే తెలంగాణాలోని నవజాత శిశువుల సంరక్షణా కేంద్రాల్లో యాంటీబయోటిక్స్ వాడే రేటు అని అర్థం. యునిసెఫ్ ఇచ్చిన రిపోర్టు మేరకు 2014, జనవరి 1 నుంచి 2015 డిసెంబర్ 14 వరకు మొత్తం 19 సంరక్షణా కేంద్రాల్లో పదమూడింటిలో ఇలా యాంటీబయోటిక్స్ 55 శాతం నుంచి 98 శాతం వరకు పిల్లలకు ఇస్తున్నారు. ఇలా ఇవ్వడం పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదని యునిసెఫ్ హెల్త్ స్పెషలిస్ట్ డాక్టర్ గగన్ గుప్తా చెబుతున్నారు. పిల్లల్లో యాంటీ బయోటిక్స్ ఇచ్చే శాతం 50 కి మించకూడదని ఆయన తెలిపారు. ఇలా పుట్టిన వెంటనే అధిక డోసేజిలో యాంటీ బయోటిక్స్ ఇవ్వడం వల్ల పెద్దయ్యాక కొన్ని చికిత్సలకు వారు స్పందించరని వివరించారు.
![]()
నివేదికలో ఉన్నదాని ప్రకారం 2014, జనవరి 1 నుంచి 2015 డిసెంబర్ 14 వరకు, ఈ ఏడాదికాలంలో తెలంగాణాలో 37,394 మంది శిశువులు నవజాత శిశువుల సంరక్షణా కేంద్రాల్లో చికిత్స పొందారు. వారిలో 27,580 మంది ఆరోగ్యంగా డిశ్చార్జ్ అవ్వగా, 3,267 మంది శిశువులు మరణించారు. 3,561 మంది పెద్ద ఆసుపత్రికి రిఫర్ అవ్వగా, 2,986 మంది చిన్నపాటి ఆరోగ్య జాగ్రత్తలతో ఇళ్లకు చేరారు. అయితే ఆరోగ్యంగా ఇంటికి చేరుకున్నట్టు చెప్పుకుంటున్న 27,580 మంది శిశువుల్లో చాలా మందికి అధిక డోసెజిలో యాంటీ బయోటిక్స్ ఇచ్చారు డాక్టర్లు. ఈ శిశువులకు ఏడాది వయసు నిండాక దగ్గు, జలుబు లాంటి చిన్న చిన్న సమస్యలే పెద్ద రోగాలకు దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Mobile AppDownload and get updated news